బాఘ్‌పట్ : ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్ జైలులో సోమవారం జరిగిన గ్యాంగ్‌స్టర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. తనను లావుగా ఉన్నాడని అవహేళన చేశాడని మరో గ్యాంగ్‌స్టర్ మున్నా బజరంగీ అలియాస్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్(51)ని హత్య చేయాల్సి వచ్చిందని గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతి చెప్పినవన్నీ కట్టు కథలేనని వెల్లడైంది. ఈ కేసు విచారణలో నిజాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
బజరంగీని హత్య చేశాక ఆధారాలు దొరక్కుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేసినట్లు నిందితుడు సునీల్ రాతి తెలిపాడు. హత్య చేసిన వెంటనే ముందుగా తుపాకీని జైలు ఆవరణలోని 8 అడుగుల లోతున్న డ్రైనేజీలో పడేశానని, ఆపై తన దుస్తులు ఉతికి.. స్నానం చేసి ఏం తెలియనట్లుగా నటించానని పోలీసుల విచారణలో వెల్లడించాడు. తుపాకీ తూటాలకు బజరంగీ మరణించడంతో జైలును దాదాపు 10 గంటలు జల్లెడ పట్టిన పోలీసులు హత్యకు సునీల్ ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. బజరంగీ ప్రాణాలు తీసింది ఆ తుపాకీ తూటాలేనని నిపుణులు తేల్చారు. వేలి ముద్రలు కనుక్కునే ఛాన్స్ ఉండకూడదని డ్రైనేజీలో తుపాకీ పడేశానని, అందులో భాగంగానే దుస్తులపై ఉన్న రక్తపు మరకలు గుర్తించవద్దని వాటిని వెంటనే ఉతికేసినట్లు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.
ముందుగానే తుపాకీ తెప్పించుకుని!
మరో గ్యాంగ్‌స్టర్ బజరంగీని హత్య చేయడం అనేది తొలుత క్షణికావేశంలో జరిగిపోయిందని.. తనను లావుగా ఉన్నాడని అవమానించినందుకే హత్య చేశానని పోలీసులను నమ్మించాడు సునీల్ రాతి. కానీ సుదీర్ఘ విచారణలో మాత్రం.. ప్లాన్ ప్రకారమే ఆహార ప్యాకెట్లలో తుపాకీ, బుల్లెట్లతో పాటు కొన్ని పుస్తకాలను తెప్పించుకున్నట్లు అంగీకరించాడు. దీంతో అసలు జైల్లోకి కోర్టు అనుమతి లేకుండా బయటి నుంచి ఆహారం, తనకు ఇష్టమైన వస్తువులు ఎలా తెప్పించుకున్నాడన్న దానిపై ఆరా తీస్తున్నారు.
సిబ్బంది కొరతే పెద్ద సమస్య
బాఘ్‌పట్ జైల్లో ఉన్న 816 మంది ఖైదీలకుగానూ 80 మంది పోలీసు సిబ్బంది ఉండాలి. కానీ 30 మంది మాత్రమే ఉండటంతో ఖైదీల వద్దకు ఏం వస్తువులు వెళ్తున్నాయి, వారితో ఆయుధాలు ఉన్నాయా అన్న తనిఖీలు జరగక పోవడం ఓ సమస్యగా మారిందిని ఓ ఐపీఎస్ తెలిపారు. హత్య జరిగిన సమయంలో మరో ముగ్గురు ఖైదీలు మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతికి సాయం చేయడంతో బజరంగీ హత్య జరిగిందని భావిస్తున్నాం. హత్య చేసిన తర్వాత నిందితుడు సునీల్ ఆధారాలు లేకుండా చేయాలని యత్నించాడని.. దీంతో కోర్టులో సరైన సాక్ష్యాలను ప్రవేశపెట్టలేకపోయామని వివరించారు. అయితే నిందితుడి కదలికలు, కొందరు ఖైదీలు ఇచ‍్చిన సమాచారం ఆధారంగా సునీల్ నిందితుడని గుర్తించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment