
పొలాల్లో పడేసిన బాలిక మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి
మల్కన్‌గిరి: పదిహేనేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేశారన్న ఆరోపణలు మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితిలోని బెజంగవాడ గ్రామంలో బుధవారం రాత్రి హోరెత్తాయి. వివరాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన బాలిక రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా గ్రామం, గ్రామ పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా బాలిక జాడ తెలియలేదు. బాలికను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని గ్రామస్తులు భావించారు.
అయితే బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పొలాల్లో బాలిక మృతదేహం కనిపించింది. దీంతో స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. దుండగులు బాలిక గొంతు కోసి చంపినట్లు తెలిపారు.
అలాగే ఒంటిపై తీవ్ర గాయాలుండడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం గురువారం సాయంత్రం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక మృతితో తల్లిదండ్రులు, గ్రామస్తులు భోరున విలపిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, ఎలాగైనా వారిని పట్టుకుని తగిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.