స్వాధీనం చేసుకున్న ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్లు, నగదుతో నిందితులు
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా వారం క్రితం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు బ్లాక్‌టికెట్లు అమ్ముతున్న గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్న సంగతి మరువకముందే మరో ముఠాను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ జరిగిన ప్రతీ నగరంలోనూ యథేచ్ఛగా కొనసాగిన వీరి బ్లాక్‌టికెట్ల దందాకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. కేవలం ఫేస్‌బుక్ ద్వారా ముగ్గురు ఒకరినొకరు పరిచయం చేసుకుని బ్లాక్‌టికెట్ల దందాను కొనసాగించారు. బ్లాక్‌టికెట్ల అమ్మకాలకు ఏకంగా విమానంలోనే వీరు రాకపోకలు సాగిస్తుండటం కొసమెరుపు.
ఫేస్‌బుక్ ద్వారా పరిచయం..
మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఆయుష్ విధేలే, కోల్‌కతాకు చెందిన సచిన్ శుక్లా, రాజస్తాన్ వాసి రిషబ్ సుథార్‌లు వేర్వేరు కాలేజీల్లో విద్యార్థులు. ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయంతో ఈ ముగ్గురు ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని పథకం వేశారు. అందుకు బ్లాక్‌టికెట్లను అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఆన్‌లైన్లో ఈ మెయిల్ ఐడీ ద్వారా పరిమిత సంఖ్యలోనే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో పథకం ప్రకారం ఈ ముగ్గురూ అనేక ఈమెయిల్ ఐడీలు సృష్టించారు. వీటి ఆధారంగా దేశంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్లను భారీగా ఆన్‌లైన్‌లో బుక్ చేసి టికెట్ కౌంటర్ల ద్వారా వాటిని తీసుకుంటున్నారు. మ్యాచ్ తేదీకి కొద్దిరోజుల ముందు ఈ ముగ్గురూ విమానాల్లో సంబంధిత నగరానికి చేరుకుని మ్యాచ్‌లకున్న డిమాండ్‌ను బట్టి ఒక్కో టికెట్‌కు రెట్టింపు ధర లేదా అంతకంటే ఎక్కువకు అమ్ముకుంటున్నారు.
ఈనెల 14, 21 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలోని ఎస్‌ఆర్‌హెచ్–డీసీ, ఎస్‌ఆర్‌హెచ్–కేకేఆర్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లతో వీరు కొద్దిరోజుల క్రితం నగరానికి చేరుకున్నారు. అయితే 14న జరిగిన మ్యాచ్‌కు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో వీరు బుక్ చేసుకున్న టికెట్లలో 89 టికెట్లను విక్రయించలేకపోయారు. రెండో మ్యాచ్‌కు సంబంధించి 162 టికెట్లను సికింద్రాబాద్ కేంద్రంగా అమ్మడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అక్కడి జింఖానా గ్రౌండ్స్ సమీపంలోని టికెట్ కౌంటర్ వద్దకు మంగళవారం చేరుకుని తమ వద్ద ఉన్న టికెట్లను అమ్మడం మొదలెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులు తమ బృందంతో దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి 251 టికెట్లు, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులైన ఈ ముగ్గురూ జల్సాలకు అలవాటు పడ్డారని, అందుకు అవసరమైన డబ్బు కోసమే ఈ మార్గం ఎంచుకున్నారని డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని బేగంపేట పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment