నిందితుడు షేక్ మాబువలి
దాచేపల్లి/గురజాల: గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో ఘోరం వెలుగు చూసింది. అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడొకరు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాచేపల్లికి చెందిన టీడీపీ నేత షేక్ మాబువలి 2013లో ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై ఓటమి పాలయ్యాడు. దీంతో టీడీపీ అధికారంలోకి రాగానే అతన్ని మండలపరిషత్‌లో కోఆప్షన్ సభ్యుడిగా నియమించింది. స్థానిక జలగల బజారులో వ్యాపారం చేస్తుంటాడు. బాధిత బాలిక తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఆమె 7వ తరగతితో చదువు మానేసింది. బాలిక తండ్రి మట్టికుండలు తయారుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాధిత బాలిక తన అక్కతో పాటు మాబువలి వద్దకు కూలి పనులకు వెళ్తోంది. దీంతో సదరు బాలికను మాయమాటలతో లోబర్చుకుని గత కొన్నినెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె ఎవరికీ చెప్పలేదు.
మూడు రోజులక్రితం కడుపు నొప్పి వస్తోందని చెప్పడంతో ఆమె అక్క ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా గర్భం దాల్చినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో జరిగిన విషయాన్ని బాలిక వెల్లడించింది. అధికారపార్టీ నేత కావడంతో కేసు పెట్టేందుకు బాలిక కుటుంబసభ్యులు భయపడ్డారు. స్థానికులు ధైర్యం చెప్పడంతో శనివారం దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో బాలికను వైద్యపరీక్షలకోసం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇటీవల దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు సుబ్బయ్య ఇంటిసమీపంలోనే ఇప్పుడు లైంగిక దాడికి గురైన బాలిక ఇల్లు కూడా ఉండడం గమనార్హం. లైంగికదాడికి గురైన బాలిక 3 నెలల గర్భిణి అని నివేదికలు చెబుతున్నాయని.. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు ఫోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్టు గురజాల డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. మరోవైపు చిన్నారికి జరిగిన అన్యాయంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు వివిధ ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. గురజాలలో వైద్యశాల నుంచి ర్యాలీగా బయల్దేరి బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ నినదించాయి.
నా బిడ్డకు న్యాయం చేయండయ్యా: బాధితురాలి తండ్రి
తన బిడ్డకు జరిగిన అన్యాయంపై బాలిక తండ్రి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ‘అయ్యా! నా బిడ్డ చిన్నతనంలో ఉండగానే తల్లి చనిపోయింది. స్తోమత లేక ఏడు వరకే చదివించుకుని బడి మాన్పించేశా.. పనికెళ్లి నాకు అండగా ఉంటోంది. జరిగిన విషయం తలచుకుంటే నాకు గుండె దడ వస్తుందయ్యా.. తల్లి లేని బిడ్డ.. మీరే న్యాయం చేయాలయ్యా’’ అంటూ రెవెన్యూ అధికారులను వేడుకుంటున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment