
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇప్పిలి జ్యోతికుమారి, సంతోష్‌కుమార్
శ్రీకాకుళం రూరల్: మండలంలోని ఇప్పిలి గ్రామం పెద్దవీధికి చెందిన యువతి ఇప్పిలి జ్యోతికుమారిపై టీడీపీ నాయకులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. కనీసం ఆడపిల్లని కూడా చూడకుండా ఇష్టానుసారంగా కర్రలు, రాడ్‌లతో దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం ఉదయం బాధితురాలి సోదరుడు సంతోష్‌కుమార్ తన ఇంటి ఆరుబయట కాళ్లు శుభ్రం చేసుకుంటున్న సమయంలో అటువైపుగా వెళ్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇప్పిలి సత్యనారాయణ ‘మీరు వాడే మురికి నీరు దాటి మేం వెళ్లాలా’ అంటూ వాగ్వివాదానికి దిగారు.
తగాదా పెద్ద కావడంతో సమీపంలో ఉన్న సత్యనారాయణ కుమారుడు ఇప్పిలి లోకేష్, టీడీపీకి చెందిన ఇప్పిలి వెంకటరమణ, ఇప్పిలి సన్యాసి, ఇప్పిలి గణపతిరావు మాకుమ్మడిగా యువకుడిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. తన అన్నపై దాడి చేస్తున్నారని తెలుసుకున్న జ్యోతికుమారి.. ఇంట్లో నుంచి కేకలు వేస్తూ బయటకు వచ్చి వారిని అడ్డుకోబోయింది. ఆమెను కూడా నిందితులు కర్రతో తలపై బలంగా మోదడంతో రక్తపు మడుగుల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే 108లో శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. తలపై బలమైన గాయాలు కావడంతో ఆమెకు 7 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు.
రెండేళ్లుగా భరిస్తున్నాం..
ఇదిలా ఉండగా... ఇప్పిలి సత్యనారాయణ మాస్టారు బాత్‌రూం నీరు గతంలో తమ ఇంటి మీదుగానే వెళ్లేదని, తమ కుటుంబం అంతా ఆ మురికి నీటి మీదుగానే రెండు సంవత్సరాలుగా రాకపోకలు సాగించే వాళ్లమని బాధితుడు సంతోష్‌కుమార్ తెలిపారు. అయితే... ఇటీవల కాలువలు నిర్మించడంతో మురుగు నీరంతా అందులోకే పోతుందని, దీని వల్ల ఏ ఇంటికీ ఇబ్బంది లేదని పేర్కొన్నారు. టీడీపీకి చెందిన వారంతా కక్ష్య పూరితంగానే తమపై దాడికి పాల్పడ్డారని, ఆడపిల్లని కూడా చూడకుండా తన చెల్లిని విచక్షణా రహితంగా కొట్టారని వాపోయారు. మరోవైపు... విషయం కాస్తా శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసులు శనివారం ఉదయం రిమ్స్ ఆస్పత్రిని చేరుకొని వివరాలను నమోదు చేశారు. డిస్చార్జ్ అయిన అనంతరం ఆధార్‌కార్డు తీసుకొని స్టేషన్‌కు రాజీ కోసం రావాలంటూ బాధితులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment