
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు శనివారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన విద్యార్థిని బి.కొత్తకోట ఏపీ మోడల్ స్కూల్లో చదువుతోంది. అదే పాఠశాలలో నగరి నియోజకవర్గానికి చెందిన నవీన్ తెలుగు ఉపాధ్యాయుడు. సంక్రాంతి సెలవులు కావడంతో విద్యార్థిని ఇంటికొచ్చింది.
ఈ క్రమంలో నవీన్ గురువారం ఆమెను కలిసి పాఠశాలకు సంబంధించిన వివరాలు మాట్లాడాలని చంద్రాకాలనీ గురుకుల పాఠశాలలో పనిచేసే తన పినతల్లి ఉండే క్వార్టర్స్‌కు తీసుకెళ్లాడు. ఆ సమయంలో పినతల్లి ఇంట్లో లేకపోవడంతో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికకు పట్టణంలోని ఓ థియేటర్‌లో సినిమా చూపించి, ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. తమ కుమార్తె ఇంటికి ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.