ఇంటి గోడపై దొంగ రాతలు
కొచ్చి : దొంగతనానికి వచ్చిన ఓ దొంగ తను దోచుకోబోయే ఇళ్లు మిలటరీ అధికారిదని తెలిసి వెనక్కు తగ్గాడు. ఆ ఇంటికి దొంగతనానికి వచ్చినందుకు ప్రశ్చాతాపపడుతూ ఆ మిలటరీ అధికారిని క్షమాపణ కోరాడు. ఓ దొంగ దేశభక్తిని ప్రదర్శించిన ఈ విచిత్ర సంఘటన కేరళలోని తిరువంకులంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఓ దొంగ తిరువంకులంలోని ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు. మెల్లగా తన పని తాను చేసుకుపోతున్న సమయంలో అక్కడ మిలటరీ టోపీ కనిపించింది. అంతే అతడు తన పనిని విరమించాడు. అక్కడి ఏ వస్తువు జోలికిపోకుండా బయటకు వచ్చేశాడు. పోతూపోతూ ఆ ఇంటి గోడ మీద ‘‘ నాకు ఇది మిలటరీ అధికారి ఇళ్లని తెలీదు. ఇదో మిలటరీ అధికారి ఇళ్లని తెలుసుంటే దొంగతనానికి వచ్చేవాడిని కాదు. చివరిక్షణంలో మిలటరీ టోపీ చూశాను. నాకు అర్థమైపోయింది. నన్ను క్షమించండి. నేను ఏడవ నిబంధనను అతిక్రమించాను’’ అని మార్కర్‌తో రాశాడు.
ఉదయం ఇంటిని శుభ్రం చేయటానికి వచ్చిన పనిమనిషి ఇంటి తలుపులు బద్ధలై ఉండటం గమనించింది. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ దొంగ అదే రోజు రాత్రి అక్కడికి దగ్గరలోని ఓ షాపులో దొంగతనం చేసినట్లు వారు గుర్తించారు. కాగా, ఆ ఇంటి యాజమాని అయిన రిటైర్డ్ కల్నల్ గత కొద్దినెలలుగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment