
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా చాట్రాయి మండలం సూరంపాలెం గ్రామంలో ముగ్గురు దొంగలు హల్ చల్ చేశారు. గత కొంతకాలంగా నూజివీడు, పరిసర గ్రామాలతో పాటు చాట్రాయి మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు జరిగే అవకాశం ఉన్నందున రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాట్రాయి మండలం సూరంపాలెంలో మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన కొందరు యువకులు గస్తీ తిరుగుతున్నారు.
అదే సమయంలో చోరీకి వచ్చిన ముగ్గురు యువకులు ఓ ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. గస్తీ తిరుగుతున్న యువకులను చూసిన దొంగలు పరారయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు దొంగలు పారిపోగా ఒక వ్యక్తిని గ్రామస్తులు ద్విచక్రవాహనంతో సహా పట్టుకుని దేహశుద్ధి చేశారు. పట్టుబడిన యువకుడు నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామ వాసిగా గుర్తించారు. పరారైన మరో ఇద్దరు కోసం గ్రామస్తులు గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment