గణేష్ మృత దేహం
ఆదివారం రాత్రి10:30 గంటలు బైక్‌పై బయటికి వెళ్లిన కొడుకు ఇంకా ఇంటికి రాలేదని తల్లిదండ్రు ఎదురుచూపు.. తీరా చూస్తే ప్రమాదం చోటుచేసుకుందని చేదుకబురు.. చికిత్స కోసం తర లిస్తుండగా.. మార్గమధ్యంలో మృత్యువాత.. సోమవారం ఉదయం 7:30గంటలు సొంత పనులపై పట్టణానికి బైక్‌పై వెళ్తున్నారు.. ఇటుకల లోడ్‌తో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం.. వేర్వేరు ప్రదేశాల్లో బైక్‌పై వెళ్తుండగా ప్రమాదాలు చోటుచేసుకుని ఓ బాలుడు, ఇద్దరు యువకులు అకాల మరణం చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.వివరాలు ఇలా..
మన్ననూర్(అచ్చంపేట): అమ్రాబాద్ మండలం ఈదులబావి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు, ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పదర మండల కేంద్రానికి చెందిన మురళి(14), గణేష్(23)సుమారు 7:30 గంటల సమయంలో ఇద్దరు కలిసి బైక్‌పై అచ్చంపేటకు వెళ్తున్నారు. ఇదే సమయంలో హాజీపూర్ నుంచి ఇటుకల లోడ్‌తో లారీ పదర వైపు వెళ్తుంది. ఈ క్రమంలో ఈదులబావి వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సంఘటన సమాచారం తెలుసుకున్న అమ్రాబాద్ సీఐ రమేష్ కొత్వాల్, ఎస్‌ఐ రాంబాబు సంఘటన ప్రాంతానికి హుటాహుటిన వెళ్లారు. సంఘటన వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రెండు మృతదేహాలను అమ్రాబాద్ ఆస్పత్రికి తరలించారు.
అమరచింత(కొత్తకోట): ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న ఓ డిగ్రీ విద్యార్థి ఎదురుగా సైకిల్‌పై వస్తున్న ఓ వ్యక్తిని తప్పించబోయి బలంగా ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలుకాగా.. ద్విచక్రవాహనదారుడు మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుందని ఆత్మకూర్ ఎస్‌ఐ సీహెచ్.రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా.. అమరచింత మండలం మస్తీపురం గ్రామానికి చెందిన శివారెడ్డి కుమారుడు అరుణ్‌కుమార్‌రెడ్డి(21) ఆత్మకూర్ నుంచి ఆదివారం రాత్రి 10:30 గంటల తర్వాత ద్విచక్రవాహనంపై గ్రామానికి వస్తున్నాడు. ఖానాపురం గ్రామస్టేజీ సమీపంలో ఎదురుగా సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని తప్పించబోయి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో బాధపడతున్న అరుణ్‌కుమార్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్.రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment