
తేతలి వద్ద లారీని ఢీకొన్న ఇన్నోవా కారు
తణుకు: తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. హైదరాబాద్ నుంచి వివాహం నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్‌తో సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో దళే కృష్ణ, పావన రుతిక, కారు డ్రైవర్ కాకులమర్తి గంగాధర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు, రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన దళే కృష్ణ కుటుంబం కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన రెండో కుమార్తె మానస పెళ్లి నిశ్చయం కావడంతో ఈనెల 29న సొంతూరు ప్రత్తిపాడులో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో పెళ్లి కుమార్తెతోపాటు తల్లిదండ్రులు కృష్ణ, సుభాషిణి, సోదరి రమ్యశ్రీ, పొరుగున నివాసం ఉంటున్న వృద్ధురాలు పావన రుతికలు డ్రైవర్ కాకులమర్తి గంగా«ధర్‌ను తీసుకుని బుధవారం రాత్రి ఇన్నోవా కారులో బయలుదేరారు. దారి మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రత్తిపాడు బయలుదేరుతుండగా తణుకు మండలం తేతలి సమీపంలోని ఏఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా హైవేపై రివర్స్ చేస్తున్న లారీను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కృష్ణ, గంగాధర్, పావన రుతికలు తీవ్రంగా గాయపడగా సుభాషిణి, మానస, రమ్యశ్రీలు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
తప్పిన పెనుప్రమాదం
తణుకు హైవేపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. తేతలి గ్రామ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఏఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా రోడ్డు ఆనుకుని సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమకు విశాఖ నుంచి రద్దు లోడు గురువారం వేకువజామున వచ్చింది. దీనిని అన్‌లోడ్ చేసే క్రమంలో లారీ రివర్స్ చేస్తుండగా వాహనం ముందుభాగం రోడ్డుపైకి చేరుకుంది. దీనిని గమనించని ఇన్నోవా డ్రైవర్ గంగాధర్ లారీను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో ఇన్నోవా వాహనం ముందు భాగం నుజ్జ య్యింది. అయితే లారీ ఆయిల్ ట్యాంకర్‌ను ఇన్నోవా ఢీకొట్టడంతో తొలుత స్థానికులు భయాందోళనలకు గురయ్యా రు. డీజిల్ ట్యాంకర్‌లో ఆయిల్ తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీంతో వాహనంలో చిక్కుకున్న కృష్ణను బయటకు తీసేందుకు స్థానికులు శ్రమించారు. దాదాపు అరగంట పాటు పోలీసులు, 108 వాహనం గానీ సంఘటనా స్థలానికి చేరుకోలేదు. చివరికి క్షతగాత్రులను ఆటోలోనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు రూరల్ ఎస్సై సీహెచ్‌వీ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.