![Three Men Lynched In Maharashtra On Suspicion Of Being Robbers - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/17/lynching-1.jpg.webp?itok=BXtfqRKM)
ప్రతీకాత్మకచిత్రం
ముంబై : మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని దబాధి ఖన్వేల్ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామంలో గురువారం తెల్లవారుజామున దోపిడీ ముఠా అనుకుని గ్రామస్తులు ముగ్గురిని దారుణంగా హతమార్చారు. మృతులను సుశీల్‌గిరి మహరాజ్, నీలేష్ తెల్గాడె, జయేష్ తెల్గాడెలుగా గుర్తించారు. ముంబైకి చెందిన వీరు నాసిక్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపిన 200 మందికి పైగా గ్రామస్తులు వీరిని దోపిడీ ముఠాగా అనుమానించి దాడికి తెగబడ్డారు. తొలుత రాళ్లతో దాడిచేయగా వాహనాన్ని ఆపిన వెంటనే ముగ్గురు వ్యక్తులను బయటకు లాగి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు.
కాగా తమ వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకుని దాడికి పాల్పడుతున్నారని డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులను వారించారు. పోలీసులు చెప్పినా వినకుండా గ్రామస్తులు పోలీసు వాహనాలపైనా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు, ఓ జిల్లా పోలీస్ ఉన్నతాధికారి గాయపడ్డారు. కాగా మూడు రోజుల కిందట దొంగలుగా అనుమానిస్తూ ఏసీపీ ఆనంద్ కాలే సహా ముగ్గురు పోలీసు అధికారులు, ఓ వైద్యుడిపైనా ఈ ప్రాంతంలో దాడి జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠినచర్యలు చేపడతామని జిల్లాకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment