సంబరంలో విషాదం.. | Three Youngsters Died in Beach PSR Nellore | Sakshi
Sakshi News home page

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం

Published Thu, Jan 2 2020 9:17 AM | Last Updated on Thu, Jan 2 2020 9:17 AM

Three Youngsters Died in Beach PSR Nellore - Sakshi

రాహుల్‌ ద్రావిడ్‌ అలియాస్‌ మధు (ఫైల్‌) సోనియా (ఫైల్‌) సోను (ఫైల్‌)

వాకాడు: నూతన సంవత్సర వేడుకలను సరదాగా బీచ్‌లో జరుపుకోవాలని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం బీచ్‌కు వచ్చిన మిత్రబృందంలో ముగ్గురు సముద్రంలో మునిగి మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా తిరుపతి లీలామహల్‌ సెంటర్‌కు చెందిన బత్తల సోనియా (20) (బీటెక్‌ 3వ సంవత్సరం) అదే ప్రాంతానికి చెందిన దేరంగుల సోను (19) (డిగ్రీ సెకెండ్‌ ఇయిర్‌), తిరుపతిలోని జీవకోన ప్రాంతానికి చెందిన రాహుల్‌ ద్రావిడ్‌ అలియాస్‌ మధు (20) (ఆటో డ్రైవర్‌), దుగ్గిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి (ప్రైవేట్‌ వాహన డ్రైవర్‌), ఎస్‌కే బావాజీ (ట్రావెల్స్‌ డ్రైవర్‌) కలిసి ఓ స్నేహితుడికి చెందిన కారులో మంగళవారం రాత్రి తూపిలిపాళెం బీచ్‌కు వచ్చారు.

అక్కడ నిఘా ఉంచిన వాకాడు, మెరైన్‌ పోలీసులు వీరిని బీచ్‌ వద్దకు పోకుండా అడ్డుకున్నారు. దీంతో వీరు పోలీసులతో కొద్ది సేపు వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు వెనుదిరిగి వెళ్లిపోయిన వీరు రాత్రంతా గ్రామంలోని ఓ పాఠశాలలో ఉండి అక్కడే కేక్‌ కట్‌ చేశారు. బుధవారం ఉదయాన్నే తిరిగి బీచ్‌ వద్దకు వెళ్లారు. కారు డ్రైవర్‌గా వచ్చిన బావాజీ ఒడ్డున ఉండిపోగా, మిగిలిన నలుగురూ సముద్రంలో స్నానానికి దిగారు. ఉధృతంగా ఎగసిపడుతున్న అలల ధాటికి నలుగురూ గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్న బావాజీ కేకలు పెట్టడంతో స్థానిక మత్స్యకారులు రక్షించే ప్రయత్నం చేశారు. చంద్రశేఖర్‌రెడ్డిని మాత్రమే సురక్షితంగా బయటికి తేగలిగారు. సోనియా, సోను, రాహుల్‌ ద్రావిడ్‌లను తీరానికి తీసుకువచ్చినప్పటికీ అప్పటికే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే వీరిని నాయుడుపేట ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement