మైపాడు సముద్ర తీరం
వారాంతపు, పండగ, వేసవి సెలవుల్లో ప్రజలు విహరించేందుకు సాగర తీరాలకు చేరుతున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రతతో సేద తీరేందుకు అత్యుత్సాహం చూపుతున్నారు. అయితే ఈ విహారాలు కొన్ని పరిస్థితుల్లో విషాదాలుగా మిగులుతున్నాయి. జిల్లాలో తుమ్మలపెంట, మైపాడు, కొత్తకోడూరు, తూపిలిపాళెం, తడ వంటి పర్యాటక ప్రాంతాల్లో మనసున దోచే సముద్రపు కెరటాల్లో జలకాలాడెందుకు పర్యాటకులు జిల్లా నుంచి చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. అయితే అలల ఉధృతిని అంచనా వేయలేని పర్యాటకులు తీరంలో సేద తీరుతూ మృత్యు కెరటాలకు బలవుతున్నారు. మద్యం మత్తులో కూడా ఇంకొందరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, రాకాసి అలలను లెక్క చేయకుండా లోతైన ప్రాంతానికి వెళ్లిపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సెల్ఫీల మోజులో పడి తమను తాము మరిచిపోవడంతో విహర యాత్రలు విషాద యాత్రలుగా మారుతున్న ఘటనలు ఇటీవల కాలంలో అధికంగా చోటు చేసుకొంటున్నాయి. దీంతో కలలు కన్న కొడుకులు, కుటుంబ భారాన్ని మోయాల్సిన పెద్దలు, శ్వాసగా భావించే స్నేహితులు మిగిలిన వారికి దూరమై గుండె కోతను మిగుల్చుతున్నారు.
ఇందుకూరుపేట/తోటపల్లిగూడూరు/వాకాడు: జిల్లాలోని బీచ్‌లు భద్రతలేకుండా పోయాయి. గడచిన ఏడాదిలో జిల్లాలోని బీచ్‌ల్లో పదుల సంఖ్యలో పర్యాటకులు, యువకులు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా జిల్లాలోని వాకాడు మండలం తూపిలిపాళెం బీచ్‌లో పరిధిలోనే ఏడాది కాలంలో 14 మంది మృతి చెందారు. ఇక్కడ అతి భయంకరమైన జల గండాలు ఉన్నాయి. ఈ విషయం స్థానికేతరులకు ఏ మాత్రం తెలియదు. దీంతో పర్యాటకులు తీరంలోని జెట్టీ ప్రాంతంలో సముద్ర స్నానాలు చేసి అలల వలలో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గడిచిన 6 నెలల్లో జెట్టీ ప్రాంతంలో మునిగి ఐదుగురు పర్యాటకులు కెరటాలకు మృత్యువాత పడ్డారు. కోట మండలం వీరారెడ్డి సత్రానికి చెందిన సిద్ధపురెడ్డి రమ్య (15), గంధళ్ల రోషిణి (16) గత నవంబర్ 30న బీచ్‌లో ప్రాణాలను పోగొట్టుకుని తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను మిగిల్చారు. తిరుపతి ప్రాంతానికి చెందిన బిల్డర్ అంతటి విశ్వనాథం (37) డిసెంబర్ 22న జెట్టీ వద్ద స్నానానికి వెళ్లి మృతి చెందగా, డిసెంబర్ 25న శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన షేక్ మహుబూబ్‌బాషా, షేక్ మునీర్ మృత్యువాతపడ్డారు. అదే నెల 26న ఓ కళాశాల విద్యార్థి ఆదే ప్రాంతంలో మునిగి గల్లంతు కాగా, స్థానికులు రక్షించారు. ఇలా ఏడాది కాలంలో జెట్టీ ప్రాంతంలో విహారానికి వచ్చి 14 మంది వరకు సముద్రంలో మృతి చెందారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
♦ సేద తీరేందుకు వెళ్లే ప్రాంతం పరిస్థితిని ముందుగానే అడిగి తెలుసుకోవాలి
♦ స్థానికులతో మాట్లాడి నీటి లోతు, అలల ఉధృతిపై అవగాహన పెంచుకోవాలి
♦ చిన్నాపెద్దా కలిసి సమూహంగా స్నానాలు చేస్తున్నప్పుడు కలిసి ఉంటూ,
♦ తోటి వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి
♦ పిల్లలను పెద్దలు, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండాలి
♦ ఫొటోలు, సెల్ఫీలు తీసుకొంటూ ఆదమరిస్తే రాకాసి అలల తాకిడికి నీటిలో కొట్టుకుపోయే అవకాశం ఉంది,
♦ తీరంలో విహరించే సమయంలో పరిమితికి మించి బోటు ఎక్కరాదు, లైఫ్ జాకెట్లను తప్పని సరిగా ధరించాలి
♦ తగిన ఆహారం తీసుకోవాలి లేదంటే స్నానం చేస్తే నీరసించి పడిపోయే ప్రమాదం ఉంది.
♦ ప్రధానంగా మద్యం తాగి ఎట్టి పరిస్థితిలోనూ సముద్రంలోకి దిగిరాదు. ఉప్పు నీటి కారణంగా మత్తు ఎక్కువయ్యి శరీరం స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది.
♦ పోలీసులు ఎక్కడికక్కడ హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేయాలి
♦ సూదూర ప్రాంతాల నుంచి వారిని లోతుకు వెళ్లకుండా స్థానికంగా పోలీస్ సిబ్బందిని పెట్టి అప్రమత్తం చేయాలి.
♦ బీచ్ ప్రాంతంలో మద్యం దుకాణాలు, బెల్టు దుకాణాలు లేకుండా చూడాలి. పర్యాటకులు సైతం మద్యం సేవించడంపై నిషేధం ఉండాలి.
♦ బీచ్‌లో సందర్శకుల తాకిడి అధికంగా ఉన్నప్పుడు స్థానిక పోలీసులతో పాటు మెరైన్ పోలీసులు అందుబాటులో ఉండాలి. బీచ్‌లో ఎంత దూరం వరకు శ్రేయస్కరమో అధికారులు, పోలీస్ సిబ్బంది తగిన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి సందర్శకులను అప్రమత్తం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment