
లోయలోకి దూసుకుపోయి చెట్టును ఢీకొన్న వాహనం
అనంతగిరి, శృంగవరపుకోట/నరసన్నపేట: నవ్వుతూ తుళ్లుతూ కేరింతలతో గడిపిన పర్యాటకులు అంతలోనే ప్రమాదంలో చిక్కుకున్నారు. అదుపు తప్పి లోయలో పడాల్సిన వాహనం అదృష్టవశాత్తూ చెట్టును ఢీకొని ఆగడంతో ఘోర ప్రమాదం తప్పింది. వాహనంలో 21మంది ఉండగా.. వారిలో ఎనిమిదిమంది పర్యాటకులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆరుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలకు చెందిన 21 మంది బుధవారం ఉదయం అరకు చేరుకుని సాయంత్రం వరకూ అక్కడి అందాలు తిలకించారు. రాత్రి 7 గంటల సమయంలో తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో అనంతగిరి మండలం
త్యాడ సమీపంలోని 4వ మలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న వింగర్ వాహనం బ్రేక్ ఫెయిలైంది. వాహనాన్ని నియంత్రించేందుకు మరో అవకాశం లేకపోవడంతో డ్రైవర్ వాహనాన్ని చెట్టును ఢీకొట్టి ఆపారు. లేకుంటే భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేదని సమాచారం. అదే సమయంలో కాశీపట్నంకు చెందిన ఓ ఉపాధ్యాయుడు అనంతగిరి నుంచి వస్తూ ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించి ఎస్.కోట సీహెచ్‌సీకి సమాచారం అందించారు. వెంటనే వైద్యసిబ్బంది చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో ముగ్గుర్ని విజయనగరం కేంద్రాస్పత్రికి, ఐదుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిలో ఎల్.దేవి, ఐ.సరస్వతి, కె.తవిటినాయుడు, ఎల్.రాజు, కె.ప్రసాద్‌రావు, ఎం.సరస్వతి, సత్యవతి, భాగ్యలక్ష్మి, లత తదితరులు ఉన్నారు.