మరమ్మతులు చేస్తున్న టెక్నీషియన్లు, కార్మికులు రైలు ఢీకొని మృతి చెందిన గోపినాధ్(ఫైల్)
వేలూరు: జోలార్‌పేట సమీపంలో రైలుకు విద్యుత్ సరఫరా చేసే రాడ్ విరిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెన్నై–బెంగుళూరు మీదుగా వెళ్లే రైళ్లన్నీ మార్గ మధ్యలోనే నిలిచి పోయాయి. వేలూరు జిల్లా అరక్కోణం నుంచి జోలార్‌పేట మీదుగా సేలం వెళ్లే ప్యాసింజర్ రైలు మంగళవారం ఉదయం 7.50 గంటల సమయంలో వచ్చింది. రైలు జోలార్‌పేట సమీపంలోని కోదండపట్టి రైల్వే స్టేషన్ చేరుకున్న సమయంలో రైలు ఇంజన్‌పై విద్యుత్ సరఫరా చేసే రాడ్డు విరిగి పోయింది. దీంతో రైలు అక్కడిక్కడే నిలిచి పోయింది. వెంటనే లోకోపైలట్ జోలార్‌పేట రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే విద్యుత్ టెక్నిషియన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో కాకినాడ నుంచి బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ రైలు, చెన్నై నుంచి వచ్చిన కోవై ఎక్స్‌ప్రెస్ రైళ్లు అక్కడికక్కేడే నిలిపి వేశారు. గంటపాటు తీవ్రంగా శ్రమించి రైలుకు మరమ్మతులు చేశారు. శేషాద్రి ఎక్స్‌ప్రెస్, కోవై ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు గంట పాటు ఆలస్యంగా నడిచాయి.
రైలు ఢీకొని టెక్నీషియన్ మృతి..
కోదండపట్టి రైల్వేస్టేషన్‌లో నిలిచి పోయిన రైలుకు మరమ్మతులు చేసేందుకు అరక్కోణం రైల్వే స్టేషన్ నుంచి నలుగురితో కూడిన బృందం వచ్చారు. వీరిలో సినియర్ టెక్నిషియన్ గోపినాథ్(40) కూడా వచ్చారు. మరమ్మతులు పూర్తి చేసి రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు పట్టాలు దాటుతుండగా బెంగుళూరు నుంచి చెన్నై వైపు వెళ్తుతున్న లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో గోపీనాధ్ అక్కడిక్కడే మృతి చెందాడు. దీనిపై రైల్వే కార్మికులు జోలార్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment