ఏసీబీ దాడుల్లో పట్టుబడిన ఎల్‌డీసీ సురేష్‌ని మీడియాకు చూపుతున్న డీఎస్పీ సుధాకరరావు
అడ్డతీగల (రంపచోడవరం): అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డతీగలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అడ్డతీగల సబ్‌ట్రెజరీలో ఎల్‌డీసీగా పని చేస్తున్న జి.సురేష్‌ని రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేసి పట్టుకున్నారు. నాలుగు నెలల వ్యవధిలో రెండుసార్లు అడ్డతీగలలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం ప్రభుత్వ శాఖల అధికారుల్లో కలకలం రేపుతోంది. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజవొమ్మంగి మండలం లాగరాయి పీహెచ్‌సీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పని చేసిన కె.సంజీవరావు 2018 జనవరి 31న పదవీ విరమణ చేశారు. అతనికి ఉద్యోగ కాలంలోని ఎరన్డ్ లీవు నిమిత్తం రావాల్సిన రూ.10 లక్షలకు లాగరాయి పీహెచ్‌సీ అధికారులు బిల్లు తయారు చేసి అడ్డతీగల సబ్ ట్రెజరీలో గత మార్చి 15న సమర్పించారు.
ట్రెజరీలోని ఎల్‌డీసీగా పని చేస్తున్న జి.సురేష్ ఈ బిల్లు పరిశీలించి సీఎఫ్‌ఎంఎస్ విధానంలో ఆన్‌లైన్ చేసి ఎస్టీఓకి ఆ వివరాలను సమర్పించాలి. ఈ పని చేయడానికి బిల్లు రూ.10 లక్షలకుగాను 10 శాతం కమీషన్‌గా రూ.10 వేలు లంచం ఇవ్వాలని సురేష్ డిమాండ్ చేశాడు. దీంతో విసిగిన సంజీవరావు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో సంజీవరావు నుంచి లంచం సొమ్ము తీసుకుంటుండగా దాడి చేసి ఎల్‌డీసీ జి.సురేష్‌ని పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుధాకరరావు తెలిపారు. నిందితుడిని రాజమహేంద్రవరం కోర్టులో శనివారం హాజరుపరుస్తామన్నారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్‌లు పుల్లారావు, తిలక్, సిబ్బంది పాల్గొన్నారు.
నాలుగు నెలల్లో రెండో కేసు
అడ్డతీగల ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న లంచాల బాగోతం నాలుగు మాసాల్లో ఇది రెండోది. గత మార్చి 22న అడ్డతీగల ఐసీడీఎస్ కార్యాలయంలోని మాతృశాఖలోని డ్రైవర్‌కు జీపీఎఫ్ బిల్లు తయారు చేసి సబ్ ట్రెజరీకి పంపడానికి జూనియర్ అసిస్టెంట్ మద్దాడి సత్యనారాయణ రూ.11 వేలు లంచం తీసుకుంటూ రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇప్పుడు తాజాగా సబ్
ట్రెజరీ ఉద్యోగి జి.సురేష్ పట్టుబడడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లుపరుగెడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment