వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న అర్బన్ ఎస్పీ అన్బురాజన్
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు అలంకరించిన కిరీటాల చోరీ కేసును ఛేదించే విషయంలో ఎక్కడా టీటీడీ పాత్ర నామమాత్రంగా కూడా కనిపించలేదు. దేశంలోనే శక్తివంతమైన భద్రతా వ్యవస్థను కలిగి ఉన్న దేవస్థానం చోరీకి గురైన మూడు కిరీటాలను కనిపెట్టలేకపోయింది. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో పోలీసులే రంగంలోకి దిగి దొంగను పట్టుకున్నారు. అనంతరం కరిగించిన కిరీటాలకు సంబంధించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సాక్షి, తిరుపతి : శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించిన మూడు బంగారు కిరీటాల చోరీతో టీటీడీ పరువు పోయిం దనే ప్రచారం జరుగుతోంది. దేవస్థానం భద్రతా వ్యవస్థ ఏమైందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కిరీటాలు అపహరణకు గురైన కేసులో టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి 3న చోరీకి గురైన కిరీటాలను దొంగ కరిగించేశాడు. చోరీకి గురై 80 రోజులు గడచిపోయాక పోలీసులు దొంగను పట్టుకున్నారు. ఆ తర్వాత దొంగ దొరికాడని, బంగారం దొరికిందని సముదాయించుకోవడం తప్ప టీటీడీ చేసిందేమీ లేదని తెలుస్తోంది.
రైడింగ్‌లు.. దర్శనాలు చేయించడానికేనా?
తిరుమల తిరుపతి దేవస్థానం భద్రత కోసం ఆక్టోపస్ నుంచి హోంగార్డు వరకు దేశంలోనే అత్యంత పటిష్టమైన వ్యవస్థ ఉంది. అయితే వీరు నిర్వర్తించాల్సిన విధులు నిర్వహించడం లేదనే విమర్శలున్నాయి. తిరుమలలోని వివిధ దుకాణాల్లో రైడింగ్ చేసి హడావుడి చేస్తారు. అంతకంటే వీవీఐపీలు, వీఐపీల దర్శనాలు చేయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో బంగారు కిరీటాలు చోరీ అయితే ఇంతవరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. నిత్యం భక్తులు ఉన్న సమయంలోనే కిరీటాలు చోరీకి గురైతే అందుకు టీటీడీ నిర్లక్ష్యమే కారణమనేందుకు శ్రీగోవిందరాజస్వామే సాక్షి. ఇంత జరిగినా టీటీడీలో ఏ అధికారి చోరీపై నోరు మెదప లేదు. సిఫారసు లేఖలతో పోస్టులు తెచ్చుకుని, డిప్యుటేషన్లపై టీటీడీకి చేరుకుని శ్రీవారి సేవా ముసుగులో వ్యాపారాలు చేసుకునేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప స్వామి ఆస్తులు, ఆభరణాలకు భద్రత విషయంపై దృష్టి సారించేవారు కరువయ్యారని భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కిరీటాలు కరిగించేశారని సాక్షి ముందే చెప్పింది
శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించిన మూడు కిరీటాలను దొంగలించిన దొంగలు కరిగించేసి ఉంటారని సాక్షి ఫిబ్రవరి 14న కథనం ఇచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. స్వామి వారికి ఎవరో భక్తులు కానుక ఇచ్చిందనే నిర్లక్ష్యంతో టీటీడీ అధికారులు వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. ఐదేళ్లుగా టీటీడీలో పాలన గాడి తప్పిందని దేవస్థానంలో పనిచేస్తున్న అధికారులే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment