
న్యూఢిల్లీ: టీవీలో ప్రసారమయ్యే పాపులర్ క్రైమ్ సీరియల్ చూసి తోటి విద్యార్థిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒక మైనర్‌బాలుడ్ని ఊపిరాడకుండా చేసి హత‍్య చేశాడు. అనంతరం కిడ్నాప్ డ్రామా ఆడి కవర్ చేసుకోవాలని ప్రయత్నించినా చివరికి పోలీసులకు చిక్కాడు. తన గర్ల్ ఫ్రెండ్‌ఫై కన్నేశాడనే అక్కసుతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐశ్వర్ సింగ్ అందించిన సమాచారం ఢిల్లీ యూనివర్సిటీ ఆర్యభట్ట కాలేజీకి చెందిన బీఏ మొదటి సంవత్సరం విద్యార్థి నవీన్ , తన స్నేహితులతో కలిసి ఈ హత్య చేశారు. ప్రధాన నిందితుడు నవీన్..ఆకాశ్ , మరో స్నేహితుడు కలిసి ఇంటర్ విద్యార్థి జతిన్(17)ను సమోసా తిందామని పిలిచారు. చత్‌ఫూర్ ఏరియాలోని రోడ్డు పక్క షాపు సమోసా తిన్నాక.. పక్కనే ఉన్నఫాం హౌస్‌కు తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. అనంతరం ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
మొబైల్, ఐడీ కార్డ్ ఇతర వస్తువులను తీసుకొని మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో పారేశారు. ఇదే సమయంలో, జతిన్ ఇంటికి తిరిగి రాకపోవడంతో పేరెంట్స్ ఫోన్ చేశారు. దీంతో కిడ్నాప్ డ్రామా ఆడిన నిందితులు రూ.20లక్షలు ఇస్తే.. జతిన్ విడిచిపెడతామని తల్లిదండ్రులను బెదరించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు ముందుగా ఆకాశ్‌ను అదుపులోకి ప్రశ్నించారు. దీంతో మాస్టర్ మైండ్ నవీన్ ఆటకట్టింది. ‘క్రైమ్ పెట్రోల్' చూసి ఈ నేరానికి పాల్పడినట్టు విచారణలో నవీన్ చెప్పినట్టు పోలీసు అధికారి తెలిపారు.