దొంగల అరెస్టు చూపుతున్న టూటౌన్ పోలీసులు
చిత్తూరు, మదనపల్లె టౌన్ : ఆ ఇద్దరూ యువకులు దొంగతనాలు చేయడంలో ఆరితేరిపోయారు. ఇళ్లకు వేసిన తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడటం, తలుపులు వేయకుండా ఆదమరచి నిద్రిస్తుంటే లోనికెళ్లి బంగారు ఆభరణాలు, డబ్బులు దొంగలించడంలో సిద్ధహస్తులయ్యారు. తరచూ దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడటం, జైలుకు వెళ్లి బెయిలుపై బయటకొచ్చి మళ్లీ దొంగతనాలు చేయడం వారికి అలవాటుగా మారింది. అలాంటి గజ దొంగలను శుక్రవారం టూటౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. టూటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ శుక్రవారం విలేకరులకు తెలిపిన వివరాలు.. పీలేరులోని కోటపల్లెకు చెందిన షేక్ రెడ్డిబాషా కుమారుడు షేక్ బావాజి(30) కొన్నేళ్లుగా జిల్లాలోని పలు చోట్ల 15 ఇళ్లలో దొంగతనాలు చేసి జైలు శిక్ష కూడా అనుభవించాడు. బయటకొచ్చిన బావాజీ దొంగ నోట్ల కేసులో జైల్లో పరిచయమైన తిరుపతికి చెందిన దేవిరెడ్డి సురేష్ రెడ్డి(34)తో కలసి ఈ నెల 22 రాత్రి మదనపల్లె ప్రశాంతనగర్ ఏడవ క్రాస్‌లోని టీచర్ హరిత ఇంట్లో రూ.ç2.85 లక్షల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఆ తర్వాత మళ్లీ చోరీకి పాల్పడేందుకు స్థానిక టౌన్ బ్యాంకు సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న వీరిని టూ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేసేసరికి నిందితులు తాము చేసిన దొంగతనాల చిట్టా విప్పారు. హరిత ఇంట చోరీకి పాల్పడింది తామేనని అంగీకరించారు.నిందితులను పట్టుకోవడానికి సహకరించిన ఐడి పోలీసులు మహ్మద్, రాఘవ, ప్రసాద్, ప్రకాష్, కిరణ్‌ను సీఐ అభినందించారు.
ఘరానా మోసగాడు అరెస్ట్
తిరుపతి క్రైం : ఓ ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.10.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం క్రైమ్ పోలీసు స్టేషన్‌లో క్రైం డీఎస్పీ రామ్మోహన్ మీడియాకు తెలిపిన వివరాలు..నగరంలోని మంగళం రోడ్డులోని వెంకటాద్రి ప్లాజా వద్ద ప్యూర్ ఫుడ్ సూపర్ మార్కెట్‌లో భాగస్వాములు కావాలని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సులేమాన్ (44) పత్రికా ప్రకటనలు ఇచ్చాడు. దీనికి ఆకర్షితులైన కొందరు పెట్టుబడికి గాను కొందరు నగదు చెల్లించారు. తీరా అతడు మోసగించినట్లు గ్రహించిన బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10,50,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో సీఐలు చల్లని దొర, సిబ్బంది కృషి చేశారని డీఎస్పీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment