![Unidentified assailants kill woman, burn body in Shadnagar - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/28/HYD.jpg.webp?itok=Bem8Qi2v)
సాక్షి, షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమవ్వడం సంచలనం రేపుతోంది. మృతురాలు ప్రియాంకారెడ్డి అని, ఆమె వైద్యురాలని పోలీసులు గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో ఆమె వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సయిపల్లి గ్రామం ఆమె స్వస్థలం కాగా.. ప్రస్తుతం శంషాబాద్‌లో వీరి కుటుంబం నివసిస్తున్నట్టు సమాచారం. రోజూ స్కూటీ మీద ప్రియాంకారెడ్డి విధులకు వెళ్లేది.
బుధవారం కూడా విధులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆమె స్కూటీ పాడైంది. దీంతో భయపడుతూ ప్రియాంక తనకు ఫోన్ చేసిందని, అక్కడి స్థానికులు స్కూటీని రిపేర్ చేయిస్తామని తీసుకెళ్లి.. దుకాణాలు మూసిఉన్నాయని మళ్లీ తీసుకొచ్చారని తనకు చెప్పిందని, అక్కడ లారీ డ్రైవర్లు తిరుగుతూ ఉండటంతో భయంగా ఉందని చెప్పిందని ప్రియాంక సోదరి మీడియాకు తెలిపారు. అక్కడే ఉండవద్దని సమీపంలోని టోల్‌గేట్ వద్దకు వెళ్లమని తాను చెప్పినా.. వెళ్లలేదని, ఈ నేపథ్యంలో తన చెల్లెలు తిరిగిరాకపోవడం, ఇంతలోనే ఈ ఘోరం జరగడం తమను కలిచివేస్తోందని ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. గుర్తుతెలియని దుండగులు ప్రియాంకపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. లారీ డ్రైవర్లు ఎక్కువగా సంచరించే ప్రాంతం కావడంతో వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
ప్రియాంకారెడ్డి సోదరి
Comments
Please login to add a commentAdd a comment