ప్రతీకాత్మకచిత్రం
న్యూయార్క్ : మహిళను అపహరించి పలు రాష్ట్రాలు తిప్పుతూ వారం రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడి దోపిడీకి తెగబడి ఎడారిలో వదిలివేసిన తండ్రీ కూతుళ్లను అమెరికన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టాన్లీ అల్‌ఫ్రెడ్ లాటన్ (54), షానియా నికోల్ లాటన్ (22)లు మహిళను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి లాస్‌ఏంజెల్స్‌లోని హైవేకు దూరంగా ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద వదిలివెళ్లగా సైనిక సిబ్బంది ఆమెను గుర్తించి సాయం చేశారని లాస్‌ఏంజెల్స్ కౌంటీ మేయర్ కెప్టెన్ హెర్నాండెజ్ తెలిపారు. అక్టోబర్ 30న తమకు పరిచయమున్న బాధిత మహిళ (42)ను లాస్‌వెగాస్ నుంచి నిందితులు కిడ్నాప్ చేశారని, తుపాకితో బెదిరించి ఆమెను పలు రాష్ట్రాల మీదుగా తిప్పారని, ఓ గదిలో వారం పాటు బంధించి లైంగిక దాడికి తెగబడి దోపిడీకి దిగారని ఆయన వెల్లడించారు.
మంచినీరు, ఆహారం లేకుండా బాధితురాలిని ఎడారిలో వదిలివేశారని, సైనిక స్ధావరం వద్ద ఆమెను చావుబతుకుల మధ్య పోరాడుతున్న పరిస్థితిలో సైనికులు గమనించి ఆస్పత్రిలో చికిత్స అందించారని అధికారులు చెప్పారు. ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం ఆమెను స్వస్థలం నెవడాకు తరలించారని, ఆమె బతికిఉండటం అదృష్టమేనని హెర్నాండెజ్ అన్నారు. ఆమె ఎంతకాలం ఎడారిలో ఉంది, కిడ్నాపర్లు ఆమెను ఎందుకు విడిచిపెట్టారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. బాధిత మహిళను కిడ్నాప్ చేసిన అనంతరం నిందితులైన తండ్రీకూతుళ్లు కాలిఫోర్నియాలోని తమ ఇంటికి తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అధికారులు చెబుతున్నారు. ఈ ఘాతుకానికి తెగబడిన తండ్రీకూతుళ్లను అరెస్ట్ చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారని లాస్‌ఏంజెల్స్ కౌంటీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment