షాపులో తనిఖీలు చేస్తున్న అధికారులు
అనంతపురం సెంట్రల్: కల్తీ పాల తయారీపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొరడా ఝుళిపించారు. కల్తీ పాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలను సరఫరా చేస్తున్న అనంతపురంలోని కమలానగర్‌లో గల కుమార్ ఏజెన్సీపై బుధవారం దాడులు నిర్వహించారు. బుక్కరాయసముద్రం మండలం ఏడావులపర్తిలో కల్తీ పాల తయారీని గుట్టురట్టు చేసిన విషయం విదితమే. కల్తీపాలదారుడైన లక్ష్మీపతీకి నకిలీ పాల తయారీలో ఉపయోగించే మురళి మిల్క్ పౌడర్‌ను కమలానగర్‌లోని కుమార్ ఏజెన్సీ నిర్వాహకులు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.
తూనికలు, కొలతలశాఖ, ఆహార కల్తీ నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో వివిధ రకాలైన పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీం తయారీకి సంబంధించిన ముడి పద్దార్థాలను బిల్లులేవీ లేకుండా విక్రయిస్తున్నట్లు నిర్వాహకుడు గోపాలకృష్ణ అధికారుల విచారణలో ఒప్పకున్నాడు. దీంతో సదరు సరుకును సీజ్ చేసి ల్యాబ్‌కు పంపారు. కార్యక్రమంలో విజిలెన్స్ సీఐలు మహబూబ్‌బాషా, విశ్వనాథచౌదరి, డీసీటీఓ జిలాన్‌బాషా, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నాగేశ్వరయ్య, తూనికలు, కొలతలశాఖ సీఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment