
ప్రతీకాత్మక చిత్రం
కొన్నాళ్ల నుంచి కొంతమంది చిన్నారులు తీవ్రఅనారోగ్యం బారినపడి చనిపోతున్నారు
భువనేశ్వర్: చేతబడి చేస్తున్నారన్న నెపంతో భార్యాభర్తలను గ్రామస్తులు గొడ్డలితో నరికి చంపారు. ఈ దుర్ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి సమితిలోని పెండ్రాల్‌గుడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వివరాలిలా ఉన్నాయి.. పెండ్రగుడ గ్రామంలో కొన్నాళ్ల నుంచి కొంతమంది చిన్నారులు తీవ్రఅనారోగ్యం బారినపడి చనిపోతున్నారు. దీనికి కారణం ఆ గ్రామంలోని భార్యాభర్తలు సోమ మాఢి(50), శుక్ర మాఢి(45)లని గ్రామానికి చెందిన కొంతమంది అనుమానించారు. వారు చేసే చేతబడి కారణంగానే పిల్లలు మరణిస్తున్నారని, ఎలాగైనా వారిని అంతమొందించాలని గ్రామానికి చెందిన ముక్కా మడకామి, లక్ష్మా మడకామి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారు అనుకున్నదే తడవుగా రాత్రి సోమ మాఢి, శుక్ర మాఢి నిద్రిస్తున్న సమయంలో వారిపై గొడ్డలితో దాడికి ఎగబడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన వారిద్దరూ రక్తపుమడుగులో సంఘటన స్థలంలోనే మృతి చెందారు.