సెల్‌టవర్‌కు ఉరేసుకున్న త్రినాథ్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వంమాట తప్పడం.. సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వ విఫలం ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. ప్రత్యేకహోదా తీసుకురావడంలో చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరికి మనస్తాపం చెంది దొడ్డి త్రినాథ్(28) అనే నిరుద్యోగి సెల్‌టవర్‌కు ఉరి వేసుకుని బహిరంగంగా ఆత్మహత్య చేసుకోవడంజిల్లాలో సంచలనం సృష్టించింది.
విశాఖపట్నం, నక్కపల్లి (పాయకరావుపేట): రాజమండ్రి సమీపంలోని లాలా చెరువు బర్మాకాలనీకి చెందిన దొడ్డి త్రినాథ్ (28) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో ఆరేళ్లుగా ఖాళీగా ఉంటున్నాడు. నక్కపల్లి మండలం వేంపాడు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న తన బావ వనం నర్సింగరావు, అక్క ఉమాదేవి వద్దకు ఏడాది క్రితం వచ్చాడు. బావకు చేదోడో వాదోడుగా ఉంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డాడు. ఉద్యోగం రాలేదు సరికదా, కనీసం నిరుద్యోగభృతి కూడా ఇవ్వకపోవడంతో తరచూ మనస్తాపం చెందేవాడు. ప్రత్యేక హోదా వచ్చినా పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు మెరగుపడేవని భావించేవాడు. హోదా విషయంలో చంద్రబాబునాయుడు రోజుకో విధంగా మాట్లాడటం చూసి ఇక హోదా వచ్చే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పాపెట్టకుండా బయటకు వచ్చేశాడు. ఎంతకీ అతను ఇంటికి రాకపోవడం.. ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో కంగారు పడ్డారు. చివరకు సాయంత్రం 8297293561 నెంబరు నుంచి నర్సింగరావుకు ఫోన్ వచ్చింది. కాగిత సెల్ టవర్ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడని అతను కొన్ని కాగితాలు జెరాక్స్ తీసి కిందపడేశాడని ఇందులో మీ నెంబరు ఉండటంతో ఫోన్ చేస్తున్నానని చెప్పాడు.
వెంటనే కాగిత వద్దకు వచ్చి చూడగా అప్పటికే త్రినాథ్ టవర్‌పై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. త్రినాథ్ తండ్రి చిన్నప్పుడే మరణించాడు. తల్లి నూకరత్నం, అన్న వీర వెంకట సత్యనారాయణతో కలిసి రాజమండ్రిలో ఉండేవాడు. అన్న రాజమండ్రిలో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్నాడు. అక్క ఉమాదేవిని నక్కపల్లి మండల పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగరావుకు ఇచ్చి వివాహం చేయడంతో వారి కుటుంబం నామవరం వద్ద ఉంటోంది. అక్కా బావల వద్దకు ఏడాది క్రితం వచ్చిన త్రినాథ్ ఇక్కడే ఉంటున్నాడు. నర్సింగరావు కుటుంబం శనివారం తిరుపతి వెళ్లడానికి సన్నద్ధులవుతున్నారు. త్రినాథ్ సోదరుడు వీర వెంకట సత్యనారాయణ అన్నవరం దర్శనానికి వచ్చాడు. తిరుగుప్రయాణంలో ఉండగా తమ్ముడి మరణ వార్త విని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటన ప్రాంతానికి స్థానికులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎస్‌ఐ సింహాచలం మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు (ఇన్‌సెట్) మృతుడు త్రినాథ్ (ఫైల్)
హోదా వస్తేనే తన మరణానికి అర్థం
‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తేనే తన మరణానికి ఒక అర్థం ఉంటుందని, మా అమ్మ నన్ను కన్నందుకు ఒక ప్రయోజనం ఉంటుందని’ పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాసిన లేఖను జేబులో పెట్టుకుని ప్రాణాలు వదిలాడు. తన మరణానికి ప్రత్యేకహోదా రాకపోవడమే కారణమంటూ లేఖలో పేర్కొన్నాడు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని పదేపదే గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు రావడంలో ఎందుకు శ్రద్ధ చూపించండం లేదంటూ నోట్‌లో ప్రశ్నించాడు. కేరళ వరద బాధితులపై అందరూ ప్రేమ చూపిస్తున్నారని, ఏపీ బాధితులను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.
ఫిర్యాదులో ప్రస్తావనకు రానిప్రత్యేక హోదా అంశం
త్రినాథ్ ఆత్మహత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించలేదు. తల్లి నూకరత్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శుక్రవారం రాత్రి మంచి ఉద్యోగం చూసుకో, అన్నయ్యకు మంచి ఉద్యోగంలేదు. నువ్వయినా మంచి ఉద్యోగం చేసుకో అని హితబోధ చేశానని ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదులో ప్రత్యేక హోదా రాలేదని, హోదా తీసుకురావడానికి చంద్రబాబునాయుడు కృషి చేయాలని, అప్పుడే తన మరణానికి అర్థం ఉంటుందని పేర్కొంటూ రాసిన సూసైడ్ లేఖ విషయాన్ని ప్రస్తావించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యేకహోదా కోసమే ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం ప్రధానంగా ప్రచారం జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే భావనతో కొంతమంది టీడీపీ పెద్దలు తెరవెనుక రాజకీయం చేసి సూసైడ్‌నోట్, ప్రత్యేకహోదా ప్రస్తావన లేకుండా ఫిర్యాదు చేయించారన్న ప్రచారం జరుగుతోంది. మృతుడు బావ నర్సింగరావు పంచాయతీ కార్యదర్శిగా ఉండటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భయపడినట్లు తెలిసింది. దీనిపై ఎస్‌ఐ సింహాచలాన్ని వివరణ కోరగా సెల్‌టవర్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కేసు నమోదు చేశామన్నారు. మృతుడు వద్ద లభించిన సూసైడ్‌నోట్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తామన్నారు.
చంద్రబాబు మోసం వల్లే త్రినాథ్ ఆత్మహత్య
ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు సర్కారు చేసిన మోసం వల్లే త్రినాథ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణపేర్కొన్నారు.ఇది ముమ్మాటికీ సర్కారు హత్యేనన్నారు. త్రినాథ్ మృతికి చంద్రబాబు సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తక్షణమే బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment