రాజు మృతదేహం
బూర్గంపాడు భద్రాద్రి జిల్లా : మరో రెండురోజుల్లో బాసర ట్రిపుల్ ఐటీలో కూతురు అడ్మిషన్ కోసం వెళ్లాల్సిన తండ్రి విద్యుత్‌షాక్‌తో విగతజీవుడయ్యాడు. బాసర వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ కుమార్తె తండ్రి మరణవార్త విని గుండెలావిసేలా రోదిస్తోంది. ‘నాన్నా నువ్వు నాకు కావాలి..నన్ను నువ్వే బాసరకు తీసుకెళ్లాలి...లే నాన్నా ...లే అంటూ’ ఆ పాప రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఫాదర్స్‌డే రోజున సారపాకలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
సారపాక గ్రామ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్‌ఏ) చెలికాని రాజు(40) ఆదివారం విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఇంట్లో కూలర్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్ రావడంతో కేకలు వేశాడు. గమనించి కుటుంబసభ్యులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కిందపడిపోయిన రాజును భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సారపాక గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజు మండలంలో అందరికీ సుపరిచితుడు.
వీఆర్‌ఏ బాధ్యతలతో పాటు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.పాతసారపాకకు చెందిన రాజుకు భార్య అరుణతో పాటు అంజలి, శ్రావణి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దకుమార్తె అంజలి ఇటీవలే పదో తరగతిలో 10 జీపీఏ సాధించింది. భద్రాచలంలోని నవోదయ పాఠశాలలో చదువుతున్న అంజలికి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది.
ఈ నెల 21న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంది. ఇందుకోసం రాజు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆదివారం ఉదయమే భద్రాచలంలోని నవోదయ పాఠశాలలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లి ‘ఈనెల 21న బాసర వెళ్తున్నాం...రెడీగా ఉండమ్మా..’ అని చెప్పి వచ్చాడు. బాసర వెళ్లేందుకు మిత్రుని కారు కూడా సిద్ధం చేశాడు. ఇంతలోనే మృత్యువు అతనిని విద్యుత్‌షాక్ రూపంలో తీసుకెళ్లింది.
రాజు మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాత సారపాకలో విషాదం అలుముకుంది. రాజు మరణవార్త తెలిసిన వెంటనే తహసీల్దార్లు కేవీ శ్రీనివాసరావు, జె.స్వర్ణ, ఆర్‌ఐ సోయం రాంబాబు, వీఆర్‌ఓలు లక్ష్మీ, రమాదేవి, శ్రీనివాస్, వరలక్ష్మి, వీఆర్‌ఏలు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment