భర్తకు అక్రమ బంధం గురించి తెలిస్తే బాగుండదని.. | Wife And Boyfriend Held in Husband Throat Cut Case Vikarabad | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం తెలుస్తుందని..

Published Thu, Jul 16 2020 8:17 AM | Last Updated on Thu, Jul 16 2020 8:17 AM

Wife And Boyfriend Held in Husband Throat Cut Case Vikarabad - Sakshi

గాయంతో ఉన్న రాజు

తలకొండపల్లి: ఓ వ్యక్తి గొంతు కోసి అడవిలో వదిలేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 10న ఫరూక్‌నగర్‌ మండలం వెంకన్నగూడెంకు చెందిన కొడావత్‌ రాజును గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి మండలంలోని నల్లమెట్టు అటవీ శివారు ప్రాంతంలో వదిలేసిన విషయం పాఠకులకు విదితమే. ఈ కేసులో రాజు భార్య శాంతిని, బామ్మర్ది శీనును, ఫంక్షన్‌హాల్‌ ఓనర్‌ ఎండీ యూసూప్, ఆయన చిన్నాయన జహీరోద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఎస్‌ఐ బీఎస్‌ఎస్‌ వరప్రసాద్‌ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.  (గొంతు కోసి.. అడవిలో వదిలేసి)

రెండేళ్ల క్రితం..
బాధితుడు రాజు రెండేళ్ల కితం తన భార్య పిల్లలతో కలిసి కుటుంబ పోషణ నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. బండ్లగూడలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరి సంసారం సాఫీగా సాగిపోసాగింది. ఏడాది కితం రాజు భార్య శాంతికి ఫంక్షన్‌ హాల్‌ ఓనర్‌ ఎండీ యూసూఫ్‌తో పరిచయం ఏర్పడింది. వీరు పరిచయం కాస్తా ప్రేమగా ఏర్పడి వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత కొన్ని రోజులుగా అన్యోన్యంగా ఉండసాగారు. భవిష్యత్‌లో రాజుకు అక్రమ సంబంధం గురించి తెలిస్తే బాగుండదని వీరిరువురు (శాంతి, యూసూఫ్‌) ఒక్క నిర్ణయానికి వచ్చారు. మన అక్రమ సంబంధానికి అడ్డు పడుతాడని భావించారు. ముందు జాగ్రత్తగా రాజును హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు శాంతి అన్న శ్రీను, యూసూప్‌ చిన్నాయన జహీరోద్దీన్‌ల సహకారం తీసుకున్నారు. నలుగురు కలిసి పక్కా ప్లాన్‌ వేశారు. 

బయటికి వెళదామని..
ఈనెల 10న రాజుకు మాయమటలు చెప్పి బయటికి వెల్దామని ఆ నలుగురు చెప్పారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి రాజుతో పాటు నలుగురు కారులో బయలుదేరారు. మార్గ మధ్యలో రాజుకు మందు తాగించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మండలంలోని నల్లమెట్టు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. రాజు దిగి మూత్రం పోస్తుండగా ఈ నలుగురు ఆయనను పొదల్లోకి లాక్కుపోయారు. చాక్‌తో గొంతు కోశారు. తీవ్రమైన రక్తం కారడంతో రాజు చనిపోతాడని భావించి వదిలేశారు. రాజు నడుచుకుంటూ మరుసటి రోజు ఉదయం రోడ్డు పైకి వచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చికిత్స నిమిత్తం రాజును హైదరాబాద్‌ ఈఎన్‌టీ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలిసులు గాలింపు చర్యలు చేపట్టారు.  పక్కా వ్యూహంతో వల పన్ని పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్‌ఐ చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement