
మంచంపై విగతజీవులై పడిఉన్న శ్రీనివాస్, పద్మ దంపతులు
కోనరావుపేట(వేములవాడ) : ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కూతురు, కుమారుని వివాహం, బార్య అనారోగ్యంతో అప్పులు పెరిగిపోయాయి. దీనికితోడు వ్యాపారం నడవకపోవడంతో ఇబ్బందులు పెరిగిపోయాయి. దీంతో ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏడడుగువేసి ఒక్కటై.. చావులోనూ కలిసే‘పోయారు’ పోలీసుల వివరాల ప్రకారం...
కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన యెల్లెంకి శ్రీనివాస్(45) గ్రామంలోనే పత్తి, కిరాణా వ్యాపారం చేస్తుంటాడు.
ఇతడికి భార్య పద్మ(40), కుమారుడు కార్తీక్, కూతురు సృజన ఉన్నారు. మూడేళ్ల క్రితం కూతురు, కుమారుడి వివాహాలు చేశాడు. దీంతో పెద్ద ఎత్తున అప్పులయ్యాయి. దీనికితోడు భార్య పద్మ అనారోగ్యానికి గురయ్యింది. ఆస్పత్రుల్లో చికిత్స, ఆపరేషన్లకు రూ.లక్షల్లో ఖర్చు అయ్యింది. అన్ని అప్పులు కలిసి రూ. కోటి 20లక్షలకు చేరుకున్నాయి.
ఇల్లు అమ్మినా..
అప్పుల బాధలకు తాళలేక సిరిసిల్లలో ఉన్న ఇంటికి రూ. 70 లక్షలకు విక్రయించాడు. అయినా ఇంకా అప్పులు రూ. 50 లక్షల వరకు ఉన్నాయి. గత రెండు, మూడేళ్లుగా వ్యాపారం సాగడంలేదు. అప్పులెలా తీర్చాలన్న బెంగతో గత కొన్ని రోజులుగా మథనపడుతున్నాడు.
ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మంగళవారం వేకువజామున క్రిమిసంహారకమందు సేవించి దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. సింగిల్‌విండో చైర్మన్ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్ రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. కోనరావుపేట ఏఎస్సై ప్రమీల వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment