విలేకరులతో మాట్లాడుతున్న బాధితులు , మోసం చేసినట్టు చెబుతున్న మహిళ (ఫైల్)
చిత్తూరు,తిరుపతి కల్చరల్: పెళ్లి చేసుకొని ఇద్దురు పిల్లలు పుట్టిన తర్వాత భర్తను వదిలేసింది. మరో వ్యక్తిని మాయమాటలతో నమ్మించి ఇంట్లో చేరి నగలతో ఉడాయించింది. తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమెను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని బాధితులు ఇద్దరు ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల ఎదుట వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన గురుప్రసాద్ మాట్లాడుతూ 2005లో చంద్రకళ అనే మహిళతో తనకు వివాహమైందని తెలిపాడు. ఏడేళ్లు సాగిన కాపురంలో తమకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారని పేర్కొన్నాడు. తర్వాత ఒక కుమారున్ని తీసుకొని ఆమె తన నుంచి వెళ్లిపోయి మోసం చేసిందని ఆరోపించాడు.
తిరుపతి శివజ్యోతినగర్‌లో కాపురమున్న గిరిబాబు భార్య నాగమణి మాట్లాడుతూ తాము మదనపల్లెలో అంగడి నడుపుకుంటూ జీవనం సాగించే వారమని తెలిపింది. చంద్రకళ అనే మహిళ తనకు ఎవరూ లేరని, బతుకు దెరువు చూపాలని తమను ఆశ్రయించిందని పేర్కొంది. ఇంటిలో పని చేసుకుంటూ బతకమని తమ ఇంటిలోనే ఒక గది ఆమెకు ఇచ్చామని తెలిపింది. ఈ క్రమంలో తన భర్తను వలలో వేసుకుందని, తాము ఇంటిలో లేని సమయంలో ఇంటిలోనున్న రూ.7 లక్షల నగదును తీసుకొని ఉడాయించిందని ఆరోపించింది. తమ బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని బంగారు నగలు తీసుకొని వెళ్లిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం మూడో వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవకోన ప్రాంతంలో ఉందని తెలిపింది. తమ బంగారు నగలు, డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని పేర్కొంది. పోలీసు అధికారులు స్పందించి సదరు చంద్రకళపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment