
సాక్షి, మిర్యాలగూడ: భూ తగాదాలతో ఓ మహిళ దారుణహత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలోని చైతన్యనగర్‌కు చెందిన మారెపల్లి అమృతారెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి అన్నదమ్ములు. వీరి స్వస్థలం నారాయణపురం. వీరు 20 ఏళ్ల నుంచి మిర్యాలగూడలో నివాసం ఉంటున్నారు. వీరికి మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమి ఉంది.
ఈ భూమి పంపకాల విషయంలో కొన్ని సంవత్సరాల నుంచి అమృతారెడ్డికి, వాసుదేవరెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డి అతడి భార్య మంజులతో కలిసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమిలో గురువారం ప్రొక్లెయిన్‌తో చెట్లు తొలగించారు. దాంతో అమృతారెడ్డి అతడి కుమారుడితో కలిసి అక్కడికి చేరుకొని భూమి విషయంలో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మారెపల్లి మంజుల, ఆమె భర్త వాసు దేవరెడ్డిపై అమృతారెడ్డి, అతడి కుమారుడు పదునైన ఆయుధాలతో దాడి చేశారు.
దీంతో మంజుల తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన వాసుదేవరెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ రమేష్‌బాబు, మాడ్గులపల్లి ఎస్‌ఐ రావుల నాగరాజు ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతి చెందిన మంజుల
Comments
Please login to add a commentAdd a comment