
సాక్షి, చెన్నై: ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ జరిగింది.. ఇందులో ఓ మహిళ చీర చిరిగింది.. అది అవమానంగా భావించింది బాధితురాలు, ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన చెన్నైలో ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చెన్నై పుదువణ్ణారపేట ఎమ్‌పీడీ ప్రాంతానికి చెందిన లోకేశ్వరన్ భార్య దివ్య (39) తమకు రేషన్ కార్డు ఇప్పించమని పక్కింటి నాగమ్మాల్‌కు రూ.6 వేలు ఇచ్చింది.
అయితే ఎన్ని రోజులు గడిచినా కార్డు ఇప్పించలేదు. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వమని దివ్య కోరడంతో నాగమ్మాల్ రూ.3 వేలు ఇచ్చింది. మిగతా రూ.3 వేలు ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చింది. దీనిపై ఆదివారం సాయంత్రం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య చీరను నాగమ్మాల్ చింపివేసినట్లు తెలుస్తోంది. ఇది అవమానంగా భావించిన దివ్య ఇంట్లోకి వెళ్ళి ఉరివేసుకుంది. వెంటనే స్థానికులు గమనించి ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ దివ్య మృతిచెందింది. కొత్త వణ్ణారపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment