
సాక్షి, నెల్లూరు : మనస్తాపంతో ఓ మహిళ ... ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. కోట మండలం ఊనుగుంటపాలెంకు చెందిన నాగార్జున, రాణి భార్యభర్తలు. వీరికి ప్రదీప్ (5), సుధీర్ (2) సంతాపం. కాగా కొంతకాలంగా నాగార్జున నెల్లూరులోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. అతడు అక్కడే ఉంటూ...వారంలో ఒకరోజు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. అయితే తమను కూడా నెల్లూరుకు తీసుకు వెళ్లాలంటూ కొద్దిరోజులుగా రాణి భర్తను కోరుతోంది.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత కుటుంబాన్ని అక్కడకు తీసుకు వెళతానంటూ సర్థి చెబుతూ వచ్చాడు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో బంధువులు, స్థానికులు కలగచేసుకుని, ఇద్దరికి సర్ధి చెప్పారు. నాగార్జున యథావిథిగా నెల్లూరు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో రాణి నిన్న రాత్రి ఇద్దరు పిల్లలకు విషం తాగించి, వారు చనిపోయిన తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తెల్లారినా ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో పక్కింటివాళ్లు వచ్చి చూడగా అప్పటికే పిల్లలతో పాటు రాణి కూడా విగతజీవిగా పడిఉంది. సమాచారం అందుకున్న నాగార్జున స్వగ్రామానికి చేరుకుని భార్య, పిల్లల మృతదేహాలను చూసి భోరున విలపించాడు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment