
సాక్షి, చొప్పదండి(పెద్దపల్లి) : నవమాసాలు మోసిన తల్లి కడుపుతీపిని చంపుకుంది. ఎంత కష్టమొచ్చిందో ఆ తల్లికి.. కన్నబిడ్డలను బావిలో పడేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. అభం.. శుభం తెలియని చిన్నారులు ఒక వైపు.. తల్లి శవం మరోవైపు తేలియాడడం చూసిన ప్రతీ మనసు చలించింది. సర్వాపూర్ ఘొల్లుమంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన స్వప్న తన ఇద్దరు కూతుళ్లతోపాటు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కుటుంబ సభ్యుల వేధింపులతో..
కుటుంబ సభ్యుల వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలు స్వప్న తల్లి లచ్చవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేందర్ కథనం ప్రకారం.. గంగాధర మండలం ర్యాలపల్లి అనుబంధ గ్రామం కురుమపల్లెకు చెందిన గుంటి ఓదెలు–లక్ష్మి పెద్ద కూతురు స్వప్నకు మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన ఆది బక్కయ్య–ఎల్లవ్వ పెద్ద కుమారుడు నరేశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి మూడేళ్ల కూతురు అహల్యశ్రీ, నాలుగు నెలల బిన్నీ ఉన్నారు. భర్త నరేశ్, అత్తామామలు బక్కయ్య, ఎల్లవ్వ, మరిది శేఖర్ కట్నం కోసం స్వప్నను వేధిస్తుండేవారు. పలుసార్లు గొడవ జరుగగా, స్వప్న తల్లిగారింటికి వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు బుజ్జగించి తిరిగి అత్తగారింటికి పంపారు. అయినా వేధింపులు ఆగలేదు.ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్వప్న ఇద్దరు కూతుళ్లను తీసుకుని మల్యాలలో నిర్వహిస్తున్న లేడీస్ ఎంపోరియం వద్దకు వెళ్తున్నాని చెప్పింది. ఇంటికి తిరిగి రాలేదు.
మండల శివారులోని వ్యవసాయ బావిలో ఇద్దరు కూతుళ్లను పడేసి, తాను ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం రైతు వ్యవసాయ బావి వద్దకు వచ్చి చూడగా విషయం వెలుగుచూసింది. స్థానికులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మృతదేహాలను పైకి తీయడంలో యువకుల సాయం..
మల్యాల మండల కేంద్రం శివారులోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలియగానే వందలాదిమంది ప్రజలు సంఘటనా స్థలానికి తరలివచ్చారు. బావిలోని శవాలను పైకి తీయడంలో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. బావిలో నుంచి శవాలను తీసేందుకు మండల కేంద్రానికి చెందిన పోచంపల్లి మల్లయ్యకు యువకులు సహకరించారు. ఇద్దరు కూతుళ్లతో సహ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నదనే వార్తా దావనంలా వ్యాపించడంతో వివిధ గ్రామాల నుంచి వందలాదిమంది సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారులను చూసి కంటనీరు పెట్టారు.
ఎమ్మెల్యే పరామర్శ..
ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సంఘటనా స్థలానికి వెళ్లారు. డీఎస్పీ వెంకటరమణ, సీఐ నాగేందర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మల్యాల, పెగడపల్లి, కొడిమ్యాల ఎస్సైలు ఉపేంద్రచారి, జీవన్, శివకృష్ణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment