ఆటోను ఢీకొన్న బస్సు
సాక్షి, జియ్యమ్మవలస(శ్రీకాకుళం) : మండలంలోని గవరమ్మపేట వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో మహిళ మంగళవారం మృతి చెందింది. ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తరలించారు.ఎస్‌ఐ పొదిలాపు నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం నుంచి జయ్యమ్మవలస వస్తున్న ఆటోను గుమ్మలక్ష్మీపురం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు గవరమ్మపేట మలుపు వద్ద బలంగా ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి 108లో తరలించారు. తరలిస్తున్న మార్గంలోనే రామినాయుడువలసకు చెందిన మరడాన సత్యవతి(55) మృతి చెందింది. చింతల భవాని, బొడ్డాపు అంజలీదేవి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. తెంటు దాలినాయుడు, తెంటు కార్తికేయ, తెంటు రామలక్ష్మి తీవ్రంగా గాయపడి పార్వతీపురంలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. తెంటు మురళి పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మరడాన సత్యవతి, చింతల భవాని, బొడ్డాపు అంజలీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన వారు...
రామినాయుడువలసకు చెందిన మరడాన సత్యవతికి ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. రెండవ కుమారుడు మురళితో పాటు తల్లి సత్యవతి కలసి రాయగడలో ఉన్న కుమార్తె భవాని వద్దకు వెళ్లి తిరిగి ఆటోలో రామినాయుడువలస వస్తుండగా కూతవేటు దూరంలో ఉన్న ఇంటికి చేరతారనగా గవరమ్మపేట వద్ద ప్రమాదం జరగడంతో సత్యవతి మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కళ్లెదుటే తల్లి మరణించడంతో పాటు చెల్లి భవాని పరిస్థితి విషమించడంతో మురళి కన్నీటి పర్యంతమవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment