
దోపిడి జరిగిన ఫైనాన్స్ సంస్థ... ఇన్‌సెట్‌లో రేణుకా దేవి
సాక్షి, చెన్నై : తిన్నింటి వాసాలు లెక్కించిన ముత్తూట్ ఫైనాన్స్ మహిళా ఉద్యోగి కటకటాల పాలైంది. ప్రియుడితో కలిసి పక్కా పథకం రచించిన ఈ కిలాడీ లేడి పోలీసులకు ఇచ్చిన సమాచారం, తనను చితక్కొట్టినట్టుగా వ్యక్తం చేసిన ఆవేదన వెరసి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. దీంతో ప్రియుడితో పాటుగా కిలాడీ ని కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో శనివారం దోపిడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు రూ. 2 కోట్ల విలువైన నగలు, నగదు చోరీకి గురైంది. అయితే ఒకే వ్యక్తి దోపిడీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల దృశ్యాలు పోలీసుల్నే విస్మయంలో పడేశాయి. వచ్చి రాగానే ఆ వ్యక్తి తనను చితక్కొట్టినట్టుగా, స్పృహ తప్పినట్టుగా అక్కడి మహిళా ఉద్యోగి రేణుకాదేవి(24) ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణను మొదలెట్టారు. తొలుత ఓ క్లీనిక్‌లో ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రిలో రేణుకాదేవి అడ్మిట్ అయినా, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు తేల్చారు. ఇది పోలీసుల అనుమానానికి బలం చేకూర్చింది. అలాగే తనపై దాడి చేసి బంగారాన్ని అపహరించుకుని వెళ్లిన వ్యక్తి హిందీలో మాట్లాడినట్టుగా ఆమె పేర్కొనడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అయితే ఓ చోట సీసీ కెమెరాలో దోపిడికి పాల్పడ్డ వ్యక్తి ఆటోలో వెళ్లడం కనిపించింది. డ్రైవర్‌ను విచారించగా అతడు స్పష్టమైన తమిళంలో మాట్లాడినట్టు పేర్కొనడం పోలీసుల అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. దీంతో రేణుకాదేవిని తమదైన స్టైల్లో మహిళా పోలీసులు విచారించగా ప్రియుడితో కలిసి వేసిన స్కెచ్ బయట పడింది.
పథకం ప్రకారం...అన్ని సక్సెస్
ఫైనాన్స్ సంస్థలో ఏ మేరకు నగలు ఉన్నాయి, శనివారం రద్దీ వివరాలను ముందుగానే తన ప్రియుడు ఈరోడ్ జిల్లా సత్యమంగళంకు చెందిన సురేష్(30)కు రేణుకాదేవి చేరవేసింది. ఆ రోజు విధుల్లో తనతో పాటుగా దివ్య కూడా ఉండడంతో పథకం ప్రకారం సాయంత్రం 3 గంటల తర్వాత నిద్ర మాత్రల్ని కాఫీలో కలిపి ఆమెకు ఇచ్చింది. దీంతో దివ్య పక్కనే ఉన్న గదిలో నిద్రకు ఉపక్రమించగా, తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా ప్రియుడికి డైరెక్షన్ ఇచ్చింది. అతడు ఉన్నది దోచుకున్నట్టు చేసింది. తాను స్పృహ తప్పినట్టుగా పడి పోవడం, గంట తర్వాత లేచి కేకలు పెట్టడం, ఇది విన్న దివ్య భయంతో పరుగున రావడం, ఆ పరిసర వాసులు చేరుకోవడం చోటు చేసుకున్నాయి. పథకం ప్రకారం దోపిడిని విజయవంతం చేసిన రేణుకా దేవి, తనపై దాడి చేసినట్లుగా, కొట్టిన వ్యక్తి హిందీలో మాట్లాడినట్టుగా పేర్కొని అడ్డంగా బుక్కయింది. కాగా సురేష్‌కు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణుకా దేవితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సురేష్ విలాసవంతంగా జీవించేందుకు ప్రియురాలితో కలిసి పథకం వేసి చివరకు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. ఈ ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు నగల్ని ఎక్కడ దాచి పెట్టారో విచారిస్తున్నారు. కాగా, సురేష్ తండ్రి నగల తయారీలో నిమగ్నమై ఉన్న దృష్ట్యా, ఆయన ద్వారా ఆ నగల్ని కరిగించే ప్రయత్నం చేసి ఉండవచ్చన్న కోనంలో విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment