ఆస్పత్రి ఆవరణలో పూజలు నిర్వహిస్తున్న మాంత్రికుడు, పాము కాటుకు గురైన మహిళ
భోపాల్ : దేశం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్నా.. మూఢ నమ్మకాల చీకట్లు తొలగడం లేదు. కంప్యూటర్ యుగంలో కూడా బాబాలు, మాంత్రికులనే ప్రజలు నమ్ముతున్నారు. మూఢ నమ్మకాల పేరుతో జరుగుతున్న ఆరాచకాలు ఇంకా తగ్గలేదని రుజువు చేసే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో జరిగింది. పాము కాటుకు గురైన ఓ మహిళ ఆస్పత్రితో చేరి భూత వైద్యుడి మంత్రాల వైద్యం చేయించుకున్నారు. డాక్టర్ల వైద్యం కాదని మాంత్రికుడి మాటలు నమ్మి ఆస్పత్రి ఆవరణంలోనే తాంత్రిక పూజలు నిర్వహించారు. ఆచారాల పేరుతో ఆ తాంత్రికుడు మహిళ దుస్తులు విప్పించి ఘోరంగా అవమానించారు. మధ్యప్రదేశ్‌లోని దామో ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మధ్యప్రదేశ్ లోని దామో జిల్లాలోని భతియాగర్ గ్రామ నివాసి అయిన ఇమ్రాత్ దేవి(25)గత ఆదివారం పాము కాటు గురైయ్యారు. చికిత్స కోసం అదే రోజు రాత్రి దామోలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. మహిళల వార్డులో ఆమెను చేర్చి వైద్యం అందించారు. కాగా అదే రోజు రాత్రి దేవి బంధువులు ఓ మంత్రగాడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ల వైద్యంకి పాము కాటు నయం కాదని, మంత్రాలతోనే నయమవుతుందని ఆచారం పేరుతో ఆమె చేత పురుషుల వార్డు బయట బట్టలు విప్పించి కొన్ని మంత్రాలు చదివాడు ఆ మంత్రగాడు. ఇదంతా ఆస్పత్రి ఆవరణలో జరిగినా సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం.
దీనిపై ఆస్పత్రి అధికారులు మాట్లాడుతూ... డ్యూటీలో ఉన్న డాక్టర్లకు, సెక్యూరిటీ గార్డుకి ఘటన గురించి తెలియదు. ఓ నర్సు మాత్రం చూసింది. కానీ ఆపేందుకు ప్రయత్నించలేదు. డాక్టర్లకు,సెక్యూరిటీ గార్డుకి సమాచారమివ్వలేదు. ఈ విషయమై సంబంధిత నర్సుకి నోటీసులు పంపామని తెలిపారు. ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఇతర వార్డుల్లోని రోగులను పరీక్షిస్తున్నాడని, రోగులు,వారి కుటుంబ సభ్యులకి కౌన్సెలింగ్ ఇస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని సివిల్ సర్జన్ మమతా తిమోరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment