రూ.1.30 లక్షలకు మహిళ అమ్మకం! | Women Trafficking In Adilabad | Sakshi
Sakshi News home page

ఉపాధి పేరుతో వల

Published Sat, Aug 10 2019 12:53 PM | Last Updated on Sat, Aug 10 2019 2:35 PM

Women Trafficking In Adilabad - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: అమాయక గిరిజన మహిళలను ఉపాధి పేరుతో కొంత మంది దళారులు ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్నారు. ఆర్థికంగా నిరుపేదలైన వారిని అమ్మాయిల కొరత ఉన్న రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. తాజాగా తిర్యాణి మండలానికి చెందిన ఓ వివాహితను ఉపాధి పేరుతో మధ్యప్రదేశ్‌కు రూ. 1.30 లక్షలకు విక్రయించారు. గత జూలైలో తన కూతురు కనిపించడం లేదని ఆ మహిళ తండ్రి తిర్యాణి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో మహిళా విక్రయం వెలుగులోకి వచ్చింది. దళారుల చేతిలో మోసపోయి ప్రాంతం కానీ ప్రాుతంలో ఇతరుల చేతిలో చిక్కిన ఆ మహిళ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు అంతా చెప్పడంతో మరిన్ని విషయాలు తెలిశాయి. దీంతో జిల్లాలో మానవ అక్రమ రవాణా బయటకు తెలిసింది. 

తిర్యాణి మండలం మారుమూల గిరిజన గూడెం కొలం తెగకు చెందిన ఓ మహిళకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్తకు పెళ్లి అయిన రెండేళ్లకే మతి స్థిమితం కోల్పోవడంతో గత కొన్నాళ్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. ఇది గమనించిన బాధితురాలు సమీప బంధువు తిర్యాణి మండలం చాపిడికి చెందిన ఓ మహిళ, రెబ్బెన మండలం ఇందిరా నగర్‌కు చెందిన వ్యక్తి, ఆసిఫాబాద్‌ పోలీసు స్టేషన్‌లో కోర్టు కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మరో వ్యక్తి  కలసి బాధితురాలకి మాయ మాటలతో ఉద్యోగం ఇప్పిస్తామని ఇతర ప్రాంతానికి అమ్మేసేందుకు ప్రణాళిక వేశారు.  ఈ ముగ్గురు కలసి బాధితురాలి ఇంటికి గత నెల 1న రాత్రి వెళ్లి ఉద్యోగం పెట్టిస్తామని ఈ రాత్రే బయలు దేరి రావాలంటు ఆమె తండ్రికి చెప్పి ఒప్పించారు. అదే రాత్రి ఇంటి నుంచి తీసుకొచ్చి ఆసిఫాబాద్‌లోని పోలీసు కానిస్టేబుల్‌ ఇంట్లో ఉంచారు. ఆ మర్నాడు కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి మధ్యప్రదేశ్‌ వెళ్లే ట్రైన్‌ ఎక్కించారు. దాదాపు రెండు రోజుల రైలు ప్రయాణం తర్వాత బాధితురాలు మధ్యప్రదేశ్‌లోని మంద్‌సూద్‌ జిల్లా గరవాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లారు. మధ్యవర్తిగా మరో వ్యక్తి బాధితురాలిని జిల్లా దాటించడంలో ఈ ముగ్గురికి తోడ్పాడ్డాడు. ఇందుకు ఆ మధ్యవర్తికి రూ.10 వేలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

రూ.1.30లక్షలకు అమ్మకం
మధ్యప్రదేశ్‌లో గరవాద్‌కు చెందిన రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బాధితురాలిని శారీరకంగా వాడుకోవడమే కాకుండా ఇంటి పనులు చేయిస్తూ నరకం చూపించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి తండ్రి తన కూతురు కనిపించడం లేదని తన ఇంటికి వచ్చి తీసుకెళ్లిన వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కొంత కాలం పాటు ఆయనకు ఆదిలాబాద్‌లో ఉన్నట్లు అబద్దం చెబుతూ కానిస్టేబుల్‌ నమ్మించసాగాడు. మరో వైపు మధ్యప్రదేశ్‌లో ఉన్న బాధితురాలు కనీసం ఫోన్‌ చేసేందుకు తన వారిని కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో అతి కష్టం మీద తప్పించుకుని తిరిగి వచ్చింది. బాధితురాలు ఆ వ్యక్తిని గట్టిగా నిలదీయడంతో తనను రూ.1.30 లక్షలు కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో ఎలాగైనా అతని బారి నుంచి తప్పించుకోవాలని చూసిన ఆమె ఎట్టకేలకు ఇంటికి చేరి పోలీసులకు విషయాలన్ని తెలిపింది. ప్రస్తుతం ఓ మహిళ, ఇద్దరు నిందితులను పోలీసులు అదపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చగా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. రిమాండ్‌లో ఉన్న ముగ్గురు వ్య క్తులకు సహకరించిన మధ్యవర్తి కోసం పోలీ సులు గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కి చెందిన వ్యక్తి సైతం మహిళను కొనుగోలు చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీంతో నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాపింగ్, రేప్, మానవ అక్రమ రవాణా తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. 

మహిళలు లేక
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ ప్రాంతాల్లో మహిళా లింగ నిష్పత్తి మగ వారితో పోలిస్తే తక్కువగా ఉండడంతో అనేక మందికి యువకులకు వివాహాలు కావడం లేదు. దీంతో ఎలాగైనా మహిళలను తీసుకొచ్చి తమ ఇళ్లలో పెట్టుకో వాలని శారీరకంగా వాడుకోవడంతో పాటు తమ వంశం వారసులను కని పెంచుకునేందుకు అమాయక గిరిజన మహిళలను పావుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మూడేళ్ల క్రితం కెరమెరి మండలంలో మానవ అక్రమ రవాణా సంబంధించి రెండు కేసులు నమోదైయ్యాయి. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. 

కఠిన శిక్షపడేలా చూస్తాం.. 
మహిళలకు మాయ మాటలు చెప్పి మానవ అక్రమ రవాణాకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాం. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ కూడా ఉన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు. తప్పు చేసిన వారందరికి కఠిన శిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. గిరిజన మహిళలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
–సత్యనారాయణ, డీఎస్పీ, ఆసిఫాబాద్‌ ( కేసు విచారణ అధికారి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement