పెదపూడి(అమృతలూరు): ప్రమాదవశాత్తూ మొక్కజొన్న యంత్రంలో పడి మహిళా కూలీ మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం మండలంలోని పెదపూడి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పెదపూడి మరియమ్మ(35) ఉదయం రోజూలానే తెల్లజొన్న నూర్పిడి పనులకు తోటి కూలీలతో కలిసి వెళ్లింది. యంత్రం వద్ద పనిచేస్తున్న సమయంలో చీరకొంగు యంత్రానికి చుట్టుకుపోయి లోనికి లాగేసింది. ఈ క్రమంలో తల మెండెం నుంచి వేరుపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో తోటి కూలీలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. మరియమ్మ భర్త జయపాల్ ఏడాది కిందట ఇంటి వద్ద ప్రమాదవశాత్తూ్త విద్యుత్ వైరు తగిలి మృతి చెందాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చుండూరు సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐలు పాపారావు, కె.రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ పిల్లలకు దిక్కెవరు!
పెదపూడికి చెందిన జయపాల్‌తో చుండూరు మండలం దుండిపాలెం గ్రామానికి చెందిన మరియమ్మకు 18 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. దంపతులిద్దరూ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించేవారు. ఉన్నంతలో తమ పిల్లలను చదివించుకునేవారు. గత ఏడాది తన పూరింట్లో కరెంట్ వైరు ఊడిపోవడంతో దానిని కలిపే ప్రయత్నం చేస్తుండగా జయపాల్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. దీంతో కుటుంబ భారం మరియమ్మపై పడింది. పిల్లల చదువుకు, కుటుంబ అవసరాల కోసం పనికి వెళ్లకతప్పని పరిస్థితి. ప్రస్తుతం కుమారుడు రవికుమార్ తెనాలిలో ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతుండగా, శ్రావణి పెదపూడి జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఏడాది కాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment