యాసీన్, అక్తర్
సాక్షి, సిటీబ్యూరో: నిషేధిత దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కో–ఫౌండర్ అతడు... హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లతో పాటు అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, వారణాసి, బెంగళూరు విధ్వంసాలకు సూత్రధారి... మొత్తమ్మీద దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లలో 149 మందిని పొట్టనపెట్టుకున్నాడు... దీనికి రెండు రెట్లకు పైగా జీవచ్ఛవాలుగా మార్చాడు... సిటీ పేలుళ్ల కేసులో రెండేళ్ల క్రితం ఉరి శిక్ష కూడా పడింది... ఇంతటి ‘ఘన చరిత్ర’ కలిగిన, ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఉగ్రవాది యాసీన్ భత్కల్ ‘ఉద్యమకారుడిగా’ మారుతున్నాడు. తమకు ఇండక్షన్ కుక్కర్లు ఇవ్వాలని కోరుతూ మరికొందరు నేరగాళ్లతో కలిసి గత నెల్లో ఇతను రెండు రోజుల పాటు నిరాహారదీక్షకు దిగాడు. తమకు యాసీన్ ఓ పెద్ద తలనొప్పిగా మారాడని తీహార్ జైలు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
‘ఏకాంత కారాగారం’లో...
కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన యాసీన్ గజ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌లకు సమీప బంధువు. 2008లో జరిగిన అహ్మదాబాద్ పేలుళ్ల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. యునానీ వైద్యుడి ముసుగులో నేపాల్‌లోని పోఖారాలో తలదాచుకుని తన అనుచరుల ద్వారా దేశ వ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడ్డాడు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్ వద్ద చేసిన జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆపరేషన్. అదే ఏడాది ఆగస్టులో పట్టుబడిన ‘యాసీన్ అండ్ కో’కు చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ళ క్రితం ఉరి శిక్ష విధించింది. దీంతో ఇక్కడి కేసు విచారణ పూర్తి కాగా.. ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్ తదితరులను తీసుకువెళ్ళారు. ప్రస్తుతం యాసీన్ భత్కల్‌ను తీహార్ జైల్లో ఉన్న ఏకాంత కారాగారంలో (సోలిటరీ కన్ఫైన్‌మెంట్) ఉంచారు. ఓపక్క ఢిల్లీ సెషన్స్ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో భత్కల్‌ను బెంగళూరు న్యాయస్థానం తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారిస్తోంది. ఇతడిని కోర్టు కేసుల విచారణ నిమిత్తం ఓ ప్రాంతం నుంచి మరో చోటుకు తీసుకువెళ్ళడం ఖర్చుతో పాటు భద్రతా కోణంతో ముడిపడి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అలా ఎలా చేస్తారంటూ..?
గత ఏడాది శీతాకాలంలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో జైల్లో ఖైదీలు ఇబ్బంది పడకుండా జైలు అధికారులు వారికి పాలు, నీళ్లు వేడి చేసుకునేందుకు కొన్ని బ్లాకుల్లో ఇండక్షన్ కుక్కర్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. వాతావరణం వేడిగా మారి సాధారణ స్థితికి చేరుకోవడంతో ఏప్రిల్‌లో వీటిని వెనక్కి తీసుకున్నాడు. ఇక్కడే యాసీన్ ‘హర్ట్’ అయ్యాడు. తమకు శాశ్వతంగా ఆ కుక్కర్లు ఇచ్చి వండుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ జైలు అధికారులతో వాగ్వాదానికి దిగాడు. దాదాపు 40 రోజుల పాటు ప్రతి రోజూ జైలు అధికారులతో గొడవ పెట్టుకున్నాడు. అయితే కుక్కర్లు శాశ్వతంగా అందించడానికి వారు ససేమిరా అనడంతో ఇక ఉద్యమమే శరణ్యమని భావించాడు. తన సహచరుడు అసదుల్లా అక్తర్, ఢిల్లీ గ్యాంగ్‌స్టర్ రవి కపూర్, నార్త్‌ఈస్ట్ ఢిల్లీకి చెందిన చీను గ్యాంగ్‌తో కలిసి నిరాహారదీక్షకు దిగాడు. రెండు రోజులు పాటు వీరంతా జైల్లో ఎలాంటి ఆహారం ముట్టుకోలేదు. దీంతో జైలు అధికారులు వ్యూహాత్మకంగా యాసీన్, అక్తర్ మినహా మిగిలిన వారితో వ్యక్తిగతంగా మాట్లాడి నచ్చజెప్పారు. వారు వెనక్కి తగ్గడంతో యాసీన్, అక్తర్ సైతం సైతం నిరాహారదీక్ష మానాల్సి వచ్చింది. తీహార్ జైల్లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర నిఘా వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. రాత్రి వేళల్లో యాసీన్‌ను ఏకాంత కారాగారంలో బంధించినా మామూలు సమయాల్లో ఇతరులను కలిసే అవకాశం ఉంది.
కలెక్షన్లు కురిపిస్తున్న ‘కథ’...
సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండి, ఎందరితో వాంటెడ్‌గా మారిన యాసీన్ భత్కల్‌ను పోఖారాలో పట్టుకున్న విధానం ఇప్పుడు కలెక్షన్లు కురిపిస్తోంది. ఇతగాడితో పాటు అక్తర్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరోలోని (ఐబీ) స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ) పట్టుకుంది. ఈ ఆపరేషన్‌కు కొంత కాల్పనికత జోడిస్తూ బాలీవుడ్‌లో ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ పేరుతో రాజ్‌కుమార్ గుప్త ఓ సినిమాను తెరకెక్కించారు. గత శుక్రవారం విడుదలైన యాసీన్ ఆపరేషన్‌తో కూడిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు వసూలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment