పెళ్లికి అడ్డుచెబుతోందని.. | Young Killed Lover Mother In East Godavari | Sakshi
Sakshi News home page

పెళ్లికి అడ్డుచెబుతోందని..

Published Wed, Aug 29 2018 1:57 PM | Last Updated on Wed, Aug 29 2018 1:57 PM

Young Killed Lover Mother In East Godavari - Sakshi

హత్యకు గురైన పొన్నమండ విష్ణుకుమారి

తూర్పుగోదావరి, అల్లవరం (అమలాపురం): ప్రేమించిన యువతితో పెళ్లి చేయకుండా,  తమ ప్రేమను అడ్డుకుంటోందన్న ఆగ్రహంతో ఆ యువతి తల్లిని దారణ హత్య చేశాడు ఓ యువకుడు. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో పొన్నమండ విష్ణుకుమారి(45) దారుణ హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన ఆమె కుమార్తెను ప్రేమించిన చిలకలపూడి దుర్గాప్రసాదు ఆమెపై చాకుతో దాడి చేసి ఈ హత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఓడలరేవు మరిడమ్మ సెంటర్‌ సమీపంలో నివసిస్తున్న విష్ణుకుమారికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె, కుమారుడు ఉన్నారు. హత్యకు పాల్పడ్డ దుర్గాప్రసాద్‌కు ఇటీవల ఆమె కుమార్తె పరిచయమై, అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దల సమక్షంలో వారికి పెళ్లి నిశ్చయించారు. గ్రామంలో విష్టుకుమారికి చెందిన మూడు సెంట్ల స్థలాన్ని, రూ.మూడు లక్షలు కట్నంగా ఇచ్చేందుకు పెద్దలు ఒప్పించారు.

అందుకు పెద్దల సమక్షంలో అంగీకరించిన విష్ణుకుమారి కొద్ది రోజులకు అభ్యంతరం తెలిపింది. దీంతో తరచూ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దుర్గాప్రసాద్‌ జీవనోపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశం వెళ్లాడు. గల్ఫ్‌ వెళ్లిన దుర్గాప్రసాద్‌ తన సంపాదనలో కొంత భాగం  విష్ణుకుమారికి పంపుతూ ఉండేవాడు. కొంత కాలం తర్వాత అతడు గల్ఫ్‌ నుంచి సొంతూరు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ముందు ఒప్పుకున్న మాట ప్రకారం తాను ప్రేమంచిన ఆమె కుమార్తెతో పెళ్లి చేయమని అడుగుతుండేవాడు. అయితే దుర్గాప్రసాద్‌కు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తోంది. కుమార్తెతో పెళ్లి చేయక, గల్ఫ్‌ నుంచి తాను పంపిన డబ్బులకు సమాధానం చెప్పక విసుగు చెందిన దుర్గాప్రసాద్‌ ఆగ్రహంతో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న విష్ణుకుమారిపై చాకుతో విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఆమె పొట్ట, రెండు అరి చేతులు, ఎడమ మోకాలు, పీక, వీపుపై మొత్తం పది చోట్ల చాకుతో పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా రక్తపు మడుగులో ఉన్న విçష్ణుకుమారిని ఆమెను మంచంపై ఉన్న బొంతతో సహా గదిలోంచి ఈడ్చుకుంటూ డాబాకు వెనుక అరుగుపైకి తీసుకొచ్చాడు. అరుగు చెంతనే ఉన్న రాడుపై ఆమెను గిరాటు పెట్టినట్టుగా విసిరేశాడు. దీంతో విష్ణుకుమారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్యకు పాల్పడిన దుర్గాప్రసాద్‌ పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు సీఐ దేవకుమార్, ఎస్సై డి.ప్రశాంత్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని విష్ణుకుమారి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

మృతురాలి కుమారుడు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కుమార్తె హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుకుంటోంది. ఏడాది క్రితమే మృతురాలి భర్త చనిపోయాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండడం... ఇల్లు గ్రామ శివారున కొబ్బరితోటలో ఉండడంతో దుర్గాప్రసాద్‌ ఈ హత్యను సునాయాసంగా చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏడాది క్రితం తండ్రిని, ఇప్పుడు తల్లిని కోల్పోవడంతో ఆమె కుమారుడు, కుమార్తె ఇక మాకు దిక్కెవరు...? అంటూ విలపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మృతదేహం వద్ద ఆధారాలు సేకరిస్తున్న ఎస్సై ప్రశాంత్‌కుమార్, సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement