
వివేక్ వంశీరాజు మృతదేహం ,సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసు జాగిలం ,మృతదేహానికి సమీపంలో ఉన్న కత్తి
ఒంగోలు క్రైం : నగరంలోని ఉత్తర బైపాస్ సమీప పొలాల్లో ఓ యువకుడు సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక నేతాజీ కాలనీకి సమీపంలోని చింతచెట్టు కుంటలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. హత్యకు గురైన యువకుడు నగరంలోని గద్దలగుంటకు చెందిన దుగ్గిరాల వివేక్ వంశీ రాజు(24)గా గుర్తించారు. హతునిపై గతంలో తాలూకా పోలీసుస్టేషన్‌లోనే మహిళలను వేధించిన కేసులు రెండు నమోదై ఉన్నాయి. ఆదివారం రాత్రి హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. హతుని ముఖంపై బలమై కత్తి గాయాలు, మద్యం బాటిళ్లను పగులగొట్టి పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. హత్యను ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొంతమంది కలిసి కుంట కట్టపై ఉన్న చింతచెట్టు కింద మద్యం తాగినట్లు అర్థమవుతోంది. ఏం జరిగిందో ఏమోగానీ మద్యం బాటిళ్లను పగులగొట్టి ముఖంపై బలంగా పొడిచినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. సంఘటన స్థలంలో చిన్నపాటి కత్తి, కారం పొట్లం ఉంది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం హత్యకు ముందు కళ్లల్లో కారం చల్లానుకున్నారా లేక మద్యంలోకి తెచ్చుకున్న తినుబండారాల్లో ఉందా.. అన్నది అర్థం కావడం లేదు. అర్ధరాత్రి సమయంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం పక్కనే ఉన్న చింతచెట్టు కుంటలో మృతదేహాన్ని పడేశారు. గతంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్లాట్ల విషయంలో పలువురిపై వివేక్ వంశీ రాజు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టి ఉన్నాడు. బి.ఫార్మసీ చదివిన వివేక్ వంశీ రాజు తండ్రి శ్రీనివాసరావు రిటైర్డ్ లెక్చరర్.
రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్
తాలూకా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు డాగ్ స్క్వాడ్ వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించింది. హత్య జరిగిన ప్రదేశంలో హతునికి సంబంధించిన ఆధారాలను డాగ్ స్క్వాడ్ పోలీస్ జాగిలానికి వాసన చూపించింది. పోలీసు జాగిలం సంఘటన స్థలం నుంచి ఉత్తరం వైపుగా కొం త దూరం ప్లాట్లు వేసిన ప్రాంతం వైపు పరుగులు తీసింది. శునకం పరుగులు తీసిన ప్రాంతంలో ఆటో వెళ్లిన ఆధారాలు కనిపించాయి. అంటే హత్య అనంతరం నిందితులు ఆటోలో త్రోవగుంట వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం వేలిముద్రల నిపుణులు జక్కంరాజు ఆధ్వర్యంలో కొన్ని ఆధారాలు సేకరించారు. తాలూకా పోలీసులు హంతకుల కోసం ప్రత్యేక బృందాలను కేటాయించారు. మృతదేహానికి సంఘటన స్థలంలోనే రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.