
మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలం కొండాపూర్‌కు చెందిన గంగనవేని గంగాధర్(20) అనే యువకుడు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్ తెలిపారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగనవేని మల్లేశం–మల్లు దంపతులకు ఇద్దరు కుమారులు. మల్లేశం ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్తున్నాడు. పెద్ద కొడుకు గంగాధర్ జగిత్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొంతకాలంగా కళాశాలకు సరిగా వెళ్లకపోవడంతో తల్లి వ్యవసాయ పనులకు రమ్మంది. దీంతో తీవ్రంగా కలత చెందిన గంగాధర్ క్షణికావేశంలో మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఉరేసుకొని యువకుడు..
రామగిరి(సెంటినరీకాలనీ): రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన మల్యాల మహేష్(28) అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేష్ తల్లి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా.. మానసికంగా కుంగిపోయాడు. తండ్రి వేరే పెళ్లి చేసుకోగా.. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈక్రమంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి తండ్రి రాయమల్లు ఫిర్యాదు మేరకు రామగిరి ఎస్సై శంకరయ్య వివరాలను సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.