
నవీన్‌నాయక్ (ఫైల్), ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన డెత్ నోటు
మైసూరు : పిల్లలు తప్పు చేస్తే పెద్దలు మందలిస్తారు.. నచ్చచెప్తారు.. కానీ పెద్దలే తప్పు చేస్తే... తమ బంధువులు ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఆ యువకుడిని వేధింపులకు గురి చేశారు. దీంతో ఆవేదనకు లోనైన ఆ యువకుడు వారి ఇద్దరి సంబంధం గురించి డెత్ నోటు రాసి దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మైసూరు తాలూకాలోని డి.సాలుండి గ్రామంలో చోటు చేసుకుంది.డి.సాలూండి గ్రామానికి చెందిన నవీన్ నాయక్(19) చిన్నమ్మ, మామ గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నవీన్ నాయక్ వారిద్దరినీ మందలించాడు.
దాంతో వారు నవీన్‌ను వేధించడం మొదలు పెట్టారు. వాళ్ల వేధింపులు భరించలేక నవీన్ నాయక్ వారి వివాహేతర సంబంధం గురించి, ప్రశ్నించినందుకు తనపై వారి వేధింపుల గురించి సుమారు ఆరు పేజీల డెత్ నోటు రాసి దాన్ని తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దయచేసి చర్యలు తీసుకోవాలని ఆ డెత్ నోటులో పోలీసులను వేడుకున్నాడు. బుధవారం నవీన్‌నాయక్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు తీసుకుని వెళ్తుండగా జయనగర పోలీసులు అక్కడికి చేరుకోని జరిగిన విషయాన్ని తెలిపి మృతదేహాన్ని శవ పరీక్షకు తరలించి దర్యాప్తు చేపట్టారు.