మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య | Young man Commits Suicide | Sakshi
Sakshi News home page

మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య

Published Thu, Mar 29 2018 12:09 PM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Young man Commits Suicide - Sakshi

సచిన్‌ శివాజీ మృతదేహం

నెల్లూరు(క్రైమ్‌): పెళ్లి తప్పిపోయిందన్న మనస్థాపంతో ఓ బంగారు బట్టీ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్నబజారు కామాటివీధిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. మహారాష్ట్ర సంగాలి జిల్లా వీటా తాలూకా గోసేవాగ్‌ గ్రామానికి చెందిన సావంత్‌ సంతోష్‌గోవింద్‌ 15 ఏళ్ల క్రితం నెల్లూరు నగరానికి వచ్చాడు. కొరడావీధిలో నివాసం ఉంటూ బట్టీ వ్యాపారం చేసుకుంటూ చేస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం అతని బంధువైన వీటా తాలూకా కాలంబి గ్రామానికి చెందిన సచిన్‌ శివాజీథోరాట్‌ (26), అతని చిన్నాన కొడుకు అశోక్‌లు ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చారు. సంతోష్‌ వద్ద బట్టీ వ్యాపారం చేస్తూ కామాటివీధిలో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసమున్నారు. కొంతకాలం తర్వాత వేరుగా బట్టీ వ్యాపారం ప్రారంభించారు. ఈక్రమంలో సచిన్‌ మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో సోదరుడు అశోక్‌పై పలుమార్లు దాడిచేశాడు.

ఇటీవల సచిన్‌కు పెళ్లి దాదాపు ఖరారైంది. ఈనేపథ్యంలో వారంరోజుల క్రితం సచిన్‌ అశోక్‌ను మద్యం మత్తులో ఇబ్బందులకు గురిచేశాడు. అతని చేష్టలను తాళలేక అశోక్‌ నాలుగురోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి జరిగిన విషయాన్ని అందరికి చెప్పాడు. ఈవిషయం కాస్తా పెళ్లికుమార్తె కుటుంబసభ్యులకు తెలిసి వారు పెళ్లిని రద్దుచేసుకున్నారు. దీంతో సచిన్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రెండురోజులుగా ఫూటుగా మద్యం సేవించి బట్టీలోనే ఉన్నాడు. బు«ధవారం ఉదయం బట్టీలో లైట్లు వెలిగి ఉండటాన్ని గుర్తించిన సంతోష్‌గోవింద్‌ తలుపులు తెరిచే ప్రయత్నం చేశాడు. అవి రాకపోవడంతో కిటికీలోనుంచి చూడగా సచిన్‌ నోట్లోనుంచి నురగ కక్కుకుని పడి ఉన్నాడు. స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా సచిన్‌ మృతిచెంది ఉన్నాడు. ఈవిషయంపై సంతోష్‌గోవింద్‌ మూడోనగర పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఎస్సై ఎస్‌.వెంకటేశ్వరరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

పురుగుమందు తాగి..   
సూళ్లూరుపేట: మండలంలోని మంగానెల్లూరు ఎస్టీ కాలనీకి చెందిన నాగముంతల ఎలీషా (23) అనే యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడని ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఎలీషా ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారంరోజులు పనికి వెళ్లకపోవడంతో అతని తండ్రి చిన్నబ్బయ్య తిట్టాడు. దీంతో మనస్థాపం చెంది ఈనెల 24వ తేదీన ఎలీషా పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు గుర్తించి వెంటనే అతడిని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 27న ఎలీషా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందడంతో చిన్నబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై తిరుపతిలోనే మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement