
సాక్షి, హైదరాబాద్(చిలకలగూడ) : మీ నాన్నకి లేకుండా రెండు క్వార్టర్ల మద్యం ఒక్కడివే తాగుతావా అని తల్లి మందలించినందుకు కుమారుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నామాలగుండుకు చెందిన మహేష్ (24), దేవయ్య తండ్రికొడుకులు. వీరు అడ్డాకూలీలుగా పని చేస్తున్నారు.
ఈనెల 18న కూలికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తూ చెరో క్వార్టర్ చొప్పున రెండు క్వార్టర్ల మందు తెచ్చుకున్నారు. అయితే రాత్రి తండ్రికి తెలియకుండా మహేష్ ఒక్కడే మద్యం మొత్తం తాగేశాడు. ఈ విషయమై అతని తల్లి లక్ష్మీ కుమారుడిని నిలదీసింది. పండగపూట తండ్రికి మద్యం లేకుండా చేశావని మందలించింది. దీంతో మద్యం మత్తులో ఉన్న మహేష్ మనస్థాపానికి లోనై ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బాధకు తాళలేక కేకలు వేయడంతో తల్లితండ్రులతోపాటు స్థానికులు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment