
సగానికి పైగా కాలిన ప్రవీణ్ మృతదేహం.. (అంతరచిత్రం) 19వ తేదీ నుంచి తన ప్రవీణ్ కనపడడం లేదని అతడి స్నేహితుడు పంపిన వాట్సప్ మెసేజ్
కొత్త తుంగపాడు (రాజానగరం): కొత్త తుంగపాడు శివారు జి.ఎర్రంపాలెం వెళ్లే దారిలో సగం పైగా కాలి పడి ఉన్న ఒక వ్యక్తి మృతదేహం ఆయా గ్రామాల్లో గురువారం సంచలనం కలిగించింది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కట్టెలతో కాల్చి, ఆనవాలు లేకుండా చేయాలని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారు ప్రయత్నించి ఉండ వచ్చునని, మృతుని శరీరంలో తల, ఒక చేయి పూర్తిగా కాలకుండా మిగిలిపోయాయని, కట్టెలు, పెట్రోలు పోసి, తగులబెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం అటుగా వెళ్లిన పై రెండు గ్రామాలవారు చూసినా గాని, పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు భయపడ్డారు. చివరికి విషయం తెలుసుకున్న వీఆర్వో హరి మోహన్ గురువారం రాజానగరం పోలీసులకు మృతిపై ఫిర్యాదు చేశారు.
మృతుడు చైతన్యనగర్‌వాసి
సంఘటనా స్థలాన్ని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ నాగరాజు, ప్రకాష్‌నగర్ సీఐ భాస్కరరావు, రాజానగరం ఎస్సై జగన్‌మోహన్‌లు సందర్శించి మృతుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కడియం మండలం మాధవరాయుడుపాలెం శివారు చైతన్యనగర్‌కు చెందిన చందక ప్రవీణ్ కుమార్ (20) మూడు రోజులుగా కనిపించడం లేదని తెలుసుకున్నారు. ఇటీవల అతడు దంతాలకు క్లిప్పింగ్ చేయించాడు. మృతదేహం పండ్లకు కూడా క్లిప్పింగ్ ఉండడంతో ఇది ప్రవీణ్ మృతదేహమేనని నిర్థారించారు. ఇదే విషయాన్ని పోస్టు మార్టం అనంతరం ప్రవీణ్ తల్లి రాజమ్మ, అక్క సిరియాల పద్మ, పెదనాన్నలు లక్ష్మీనారాయణ, అప్పారావు గుర్తించినట్టు ఎస్సై జగన్మోహన్ తెలిపారు.
వివాహేతర సంబంధమే కారణమా?
బీ ఫార్మశీ చదివిన ప్రవీణ్ రాజమహేంద్రవరంలోనే పనిచేస్తున్నారు. అక్కడ పని చేస్తున్న యువతితో అతను చనువుగా ఉండటం ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారంలో, అది నచ్చని సహోద్యోగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు భావిస్తున్నారు. కాగా ఘటన స్థలాన్ని వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గిరజాల వీర్రాజు సందర్శించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment