రాజేష్(ఫైల్)
భీమదేవరపల్లి : స్నేహితుడి వివాహ వేడుకల్లో యువకులందరూ కలుసుకుని ఉత్సాహంగా గడిపారు. పెళ్లి ఊరేగింపులో డీజే శబ్దాల నడుమ డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రంగయపల్లికి చెందిన ఓ యువకుడి వివాహ వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి డీజేతో ఊరేగింపు ప్రారంభమైంది.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆశాడపు రాజేష్(22) ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. కాసేపట్లోనే ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రి తరలించేలోపే మృతి చెందాడు. రాజేష్ డిగ్రీ పూర్తి చేసి పోలీస్ కానిస్టేబుల్ కావాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ‘పోలీసు ఉద్యోగం సంపాదించి పోషిస్తావనుకుంటే మమ్ముల్ని విడిచి పోతున్నావా కొడుకా’.. అంటూ రాజేష్ తల్లిదండ్రులు లక్ష్మి, దశరథం రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఏఎస్సై మురళీధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment