కాలువ వద్ద సహాయక చర్యల్ని పరిశీలిస్తున్న తహసీల్దార్ , ఎస్‌ఐ
ఈత సరదా ఇద్దరు యువకులను ప్రమాదంలోకి నెట్టింది. అద్దంకి బ్రాంచ్ కాలువలోకి దిగిన ముగ్గురు స్నేహితులు కొట్టుకుపోతుండగా గుర్తించిన రైతులు ఒకరిని రక్షించారు. ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు. అధికారులు తక్షణం స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామం వద్ద ఆదివారం జరిగింది.
గుంటూరు, ముప్పాళ్ల(ఈపూరు): అద్దంకి బ్రాంచ్ కెనాల్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన మండలంలోని ముప్పాళ్లలో ఆదివారం చోటు చేసుకుంది. రొంపిచర్ల మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన బండారు విజయ్‌కుమార్ గుంటూరులో జాన్‌సన్ లిఫ్ట్ కంపెనీలో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. శనివారం ఆరేపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో కొలుపులు ఉండటంతో స్నేహితులైన బండారు భాను ప్రకాష్, కలవకుంట వీరాస్వామితో కలసి గుంటూరు నుంచి గ్రామానికి వచ్చారు.
కొలుపులు ముగిసిన అనంతరం గ్రామస్తులైన బత్తుల మురళీకృష్ణ, బత్తుల వాసుదేవతో కలసి ఆదివారం సాయంత్రం ముప్పాళ్ల అద్దంకి బ్రాంచ్ కెనాల్‌లో సరదాగా ఈతకు వచ్చారు. అందరూ కాలువలో దిగారు. ఈ క్రమంలో మురళీకృష్ణ, వాసుదేవలు కాలువ కట్టపైకి వచ్చారు. విజయ్‌కుమార్, భానుప్రకాష్, కలవకుంట వీరాస్వామి ప్రవాహానికి కొట్టుకు పోతుండగా గట్టుపైన ఉన్న రైతులు విజయ్‌కుమార్‌ను తాడు సాయంతో పైకి లాగారు. భాను ప్రకాష్, వీరాస్వామి కాలువలో కొట్టుకొని పోయారు. ఇద్దరి వయస్సు 24–25 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిసింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రశాంతి, ఎస్‌ఐ పట్టాభిరామయ్య, హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్ ప్రాంతానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment