కోనసీమ: ఊహకు ఊపిరిలా.. ఆశకు శ్వాసలా.. మది నిండా మధుర జ్ఞాపకాలతో సందడి చేశారు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చుకున్నారు.. స్నేహితుల దినోత్సవం వేళ దోస్తులంతా కలసి చేసిన సందడి కొద్ది క్షణాల్లోనే ఆవిరి అయ్యింది. తమ స్నేహితుడు కళ్ల ముందే కాలువలో గల్లంతైన ఘటన చూసిన సహచరులు నిర్ఘాంతపోయారు.
ఈ ఘటన ఎస్.యానం కట్టు కాలువ వద్ద జరిగింది. స్నేహితులు, కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడిలో కొత్త కాలనీకి చెందిన చిత్రి ముఖేష్ కుమార్ (19) తన పదకొండు మంది మిత్రులతో కలసి ఎస్.యానం బీచ్‌కు వెళ్లాడు.
అక్కడ ఆట పాటలతో సముద్ర స్నానాలు చేసి సాయంత్రం వరకూ సరదాగా గడిపారు. తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఇంటికి వెళుతూ ఒంటిపై ఉన్న ఇసుకను తొలగించుకునేందుకు బీచ్‌ను ఆనుకుని ఉన్న కట్టు కాలువలో స్నానాలకు దిగారు. సముద్ర పోటు సమయం కావడంతో కాలువలో నీరు ఎక్కువగా ఉంది. దీంతో ముఖేష్ కుమార్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు చూస్తుండగానే అతను నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు.
స్నేహితులు చేతనైన సాయం చేద్దామనుకున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. స్నేహితుల దినోత్సవం రోజునే తమ మిత్రుడు ఇలా కొట్టుకుపోతుంటే తట్టుకోలేక హాహాకారాలు చేశారు. ఈ సంఘటనను తెలుసుకున్న ఎస్సై జి.వెంకటేశ్వరరావు, పోలీసులు, గ్రామస్తులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ముఖే‹Ùకుమార్ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం రాత్రి వరకూ గాలింపు కొనసాగింది. ముఖేష్ కుమార్ సోదరుడు తరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్వరరావు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment