నెల్లిపాక (రంపచోడవరం): అదృశ్యమైన యువతి 37 రోజుల తరువాత ప్రత్యక్షమైంది. తనను కిడ్నాప్ చేశారని చెప్పడంతో ఎటపాక మండలంలో అలజడి రేగింది. కిడ్నాప్ వ్యవహారంతో గ్రామాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఎటపాక మండలం రేగడగట్ట గ్రామంలో నివాసముంటున్న మడకం నారాయణ పెద్ద కుమార్తె రజిత గతనెల 13న గొల్లగూడెంలో జరిగిన శివరాత్రి జాతరకు వెళ్లి అప్పటి నుంచీ ఆచూకీ లేకుండాపోయింది. రజిత కోసం తల్లిదండ్రుల విచారించగా, సమీప గ్రామానికి చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనంపై యువతిని తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో ఆ యువకుడిపై అనుమానంతో ఎటపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడు తనకేమీ తెలియదని యువతిని అదే రోజు రాత్రి గ్రామంలో వదిలిపెట్టానని చెప్పాడు. అప్పటి నుంచీ యువతి కోసం పలుచోట్ల వెతికినా ప్రయోజనం లేకపోయింది. కేసు విచారణలో కూడా పోలీసులు పురోగతి సాధించలేకపోయారు. ఊహించని రీతిలో రజిత గత బుధవారం ఉదయం తన ఇంటికి చేరుకోవడంతో అసలు ఏం జరిగిందో తల్లిదండ్రులకు వివరించింది.
కిడ్నాప్ చేసి నిర్బంధించి..
తనను కిడ్నాప్ చేసి నిర్బంధించారని యువతి చెప్పడంతో తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. జాతరలో తన స్నేహితురాలు ఓ యువకుడి ద్విచక్రవాహనం ఎక్కించిందని, అయితే ఆ యువకుడు తనను భద్రాచలం సమీపంలోని మోతెగడ్డ జాతరకు తీసుకెళ్లి కొందరు యువకులకు అప్పగించాడని చెప్పింది. వారు ఓ సిమెంటు రేకుల గదిలో నిర్బంధించి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్, జ్యూస్‌లు ఇచ్చేవారని తెలిపింది. యువకులు ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకుని ఉండేవారని పలు విధాలుగా తనను చిత్రహింసలకు గురిచేశారని, తనను విక్రయించాలనే మాటలు వారు మాట్లాడుకునేవారని చెప్పింది. అయితే తనను నిర్బంధించిన గదికి తలుపులు వేయడం మరిచిపోవడంతో మంగళవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో అక్కడి నుంచి తప్పించుకుని కాలినడకన బుధవారం ఉదయం ఇంటికి చేరానని అంటుంది. తనను నిర్బంచిన ప్రదేశం ఎక్కడో తనకు తెలియదని చెబుతోంది.
అయితే గురువారం ఇదే విషయాన్ని చింతూరు ఐటీడీఏ పీవోకు కూడా చెప్పేందుకు గిరిజన సంఘ నాయకులతో కలిసి ఉదయం చింతూరు వెళ్లారు. అక్కడ నుంచి ఎటపాక పోలీస్టేషన్‌కు యువతి, ఆమె బంధువులు వెళ్లారు. అక్కడ ఆ యువతి ఎస్సై రాజేష్‌కు మరో కథ చెప్పింది. తాను జాతరకు వెళ్లిన విషయంపై తల్లిదండ్రులు ఘర్షణ పడుతుండడంతో భయపడి అక్కడి నుంచి మోతెగడ్డకు వెళ్లానని అక్కడి నుంచి అదే గ్రామంలో ఓ మహిళ ఇంట్లో ఉండి అక్కడి నుంచి కొన్ని రోజులు రేఖపల్లి, వెంకటాపురంలో ఉన్నానని ఇలా అనేక విషయాలు చెబుతోంది. కాగా యువతి ఎక్కడెక్కడ ఉందో! అని పోలీసులు ఆరాతీసి బంధువుల ఇళ్లలోనే ఆశ్రయం పొందినట్టు నిర్ధారణకు వచ్చారని సమాచారం. గ్రామాల్లో మాత్రం కిడ్నాప్ జరిగిందనే విషయంపై భయాందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment