సునీలను తండ్రికి అప్పగిస్తున్న పోలీసులు
ఖమ్మం, కారేపల్లి: మూడేళ్ల క్రితం కారేపల్లిలో అదృశ్యమైన ఆ యువతి, మదనపల్లిలో ప్రత్యక్షమైంది. తన బిడ్డకు ఏమైందోనని.. ఎక్కడుందోనని ఇన్నేళ్లు మదనపడిన ఆ తండ్రి, ఆమె ఆచూకీ తెలియడంతో ఆనందభరితుడయ్యాడు. కారేపల్లి పోలీసులు తెలిపిన వివరాలు...
కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన ధంసలపూడి రాములు–ధనమ్మ దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు. ధనమ్మ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. కుమార్తె సునీల వికలాంగురాలు. డిగ్రీ, బీఈడీ పూర్తిచేసింది. ఖమ్మంలోని ఓ కన్సెల్టెంట్ (పేపర్లలో ఉద్యోగావకాశాలు పేరిట ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రకటనలు చేయడం) కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌గా చేరింది. పత్రికల్లో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసిన చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన ఫైజల్ అలీ.. ఫోన్ చేశాడు. ఇలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇది క్రమేణా స్నేహానికి, ప్రేమకు దారితీసింది. వీరు పెళ్లి చేసుకుందామనుకున్నారు. మతాలు వేరవడంతో తన తండ్రి, కుటుంబీకులు ఒప్పుకోకపోవచ్చని భయపడింది. 2015, ఆగస్టు 18న సునీల తన ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. కుటుంబీకులు అన్నిచోట్ల గాలించినా ఆచూకీ తెలియలేదు. 2015, ఆగస్టు 22న కారేపల్లి పోలీసులకు తండ్రి ధంసలపూడి రాములు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగులో ఉంది. (కేసుల) పెండింగ్ ఫైళ్లను పరిశీలిస్తున్న కారేపల్లి ఎస్‌ఐ కిరణ్‌కుమార్ దృష్టిలో ఈ మిస్సింగ్ కేసు పడింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
ఆసరాతో ఆచూకీ
ఆసరా పథకం.. ఆమె ఆచూకీని కనిపెట్టింది. వికలాంగురాలైన సునీలకు నెలకు రూ.1500 పింఛన్ వస్తోంది. ఆమెకు ఇల్లందులోని ఆంధ్రాబ్యాంకులో ఖాతా ఉంది. అందులోని పింఛన్ డబ్బు జమవుతోంది. ఎస్‌ఐ కిరణ్‌కుమార్, ఇటీవల ఆ బ్యాంకుకు వెళ్లి ఖాతా వివరాలు సేకరించారు. మూడు నెలలకోసారి, ఐదు నెలలకోసారి చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఏటీఎం ద్వారా పింఛన్ డబ్బు డ్రా చేస్తున్నట్టుగా తెలిసింది. ఆయన వెంటనే హెడ్ కానిస్టేబుల్ మహమ్మూద్ అలీ, కానిస్టేబుల్ రాజేష్‌ను (వారం క్రితం) మదనపల్లి పంపించారు. వారు అక్కడే బస చేశారు. ఏటీఎం సీసీ పుటేజీలను సేకరించారు. ఆమెను కనిపెట్టారు. విచిత్రంగా. ఆమె బురఖా వేసుకుని ఉంది. ఆమే సునీల కావచ్చని ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు నిర్థారించుకున్నారు. వారికి ఆ ‘బురఖా’తో చిక్చొచ్చి పడింది. ఆ ఫొటో, వివరాలతో స్థానిక పోలీసుల సాయంతో వారం రోజులపాటు ఇంటింటికీ తిరిగి వాకబు చేశారు. ఈ క్రమంలోనే, మినరల్ వాటర్ సప్లయ్ బాయ్‌కు కూడా ఫొటో చూపించి, వివరాలు (వయసు, వికలాంగురాలు) తెలిపారు. ఆమెను ఆ బాయ్ గుర్తించాడు. ఆచూకీ చెప్పాడు. అక్కడకు పోలీసులు వెళ్లారు. సునీల కనిపించింది. ఆమె తన పేరును రేష్మగా మార్చుకుంది. ఫైజల్ అలీని పెళ్లి చేసుకుంది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఆ ముగ్గురినీ పోలీసులు కారేపల్లికి తీసుకొచ్చారు.
ఆ తండ్రి, తన కొడుకులతో కలిసి సునీల కోసం కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఉదయం నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో పోలీసులతోపాటు వచ్చిన తన కూతురిని చూసి ఒక్కసారిగా భోరున విలపించాడు. తన బిడ్డ క్షేమంగా ఉందని, తనకు అది చాలని అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. సునీల కూడా తన తండ్రిని, తమ్ముళ్లను చూసి ఆనంద భాష్పాలు రాల్చింది. మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. ఎస్‌ఐ కిరణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మహమ్మూద్ అలీ, కానిస్టేబుల్ రాజేష్‌ను ఖమ్మం రూరల్ ఏసీపీ సురేష్ రెడ్డి అభినందించారు. మహమ్మూద్ అలీ, రాజేష్‌కు రివార్డు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment